icon icon icon
icon icon icon

రైల్వేజోన్‌కు స్థలంపై కేంద్రమంత్రి అబద్ధం చెప్పారట!

‘రైల్వేజోన్‌కు స్థలం అడిగితే రాష్ట్రప్రభుత్వం ఇవ్వలేదని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ పచ్చి అబద్ధం చెప్పారు. ఇవ్వలేదని ఏ రకంగా చెబుతారు? ఆధారాలతో మాట్లాడాలి తప్ప చౌకబారు విమర్శలు చేయకూడదు’ అంటూ కేంద్రమంత్రి మాటలను బొత్స సత్యనారాయణ ఖండించారు.

Published : 27 Apr 2024 05:38 IST

పూర్తి విషయం తెలియకుండా బొత్స సత్యనారాయణ హడావుడి

ఈనాడు, విశాఖపట్నం: ‘రైల్వేజోన్‌కు స్థలం అడిగితే రాష్ట్రప్రభుత్వం ఇవ్వలేదని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ పచ్చి అబద్ధం చెప్పారు. ఇవ్వలేదని ఏ రకంగా చెబుతారు? ఆధారాలతో మాట్లాడాలి తప్ప చౌకబారు విమర్శలు చేయకూడదు’ అంటూ కేంద్రమంత్రి మాటలను బొత్స సత్యనారాయణ ఖండించారు. శుక్రవారం విశాఖ వైకాపా కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ, రైల్వేజోన్‌కు 52 ఎకరాలు ముడసర్లోవలో భూమి అప్పగించామని, మరి ఎందుకు ప్రారంభించలేదని కేంద్రమంత్రిని బొత్స ప్రశ్నించారు. రైల్వేజోన్‌కు భూమి ఇవ్వలేదని పార్లమెంటులో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన తర్వాతే రాష్ట్రప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. బీఆర్టీఎస్‌ రహదారి విస్తరణలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి రైల్వేస్టేషన్‌ వరకు రైల్వేస్థలాలను జీవీఎంసీ చాలా తీసుకుంది. వాటికి ప్రత్యామ్నాయంగానే ముడసర్లోవ పరిధిలో 52 ఎకరాలు కేటాయించారు. ఇది ప్రత్యేకంగా రైల్వేజోన్‌కు కేటాయించింది కాదు. ఆ విషయం బొత్సకు తెలుసో లేదో అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైల్వేజోన్‌కు స్థలం కేటాయించాలంటూ జీవీఎంసీకి ఓ లేఖ రాగా.. అందులో ప్రత్యామ్నాయంగా ఇచ్చిన స్థలంతోపాటు మరో 40 ఎకరాలు కలిపి ఇవ్వాలని పేర్కొన్నారు. అప్పుడు గతంలో కేటాయించిన 52 ఎకరాలు, మరో 40 ఎకరాలు కలిపి స్థలం ముడసర్లోవలో కేటాయించారు. ఇదీ అసలు విషయం. పైనాపిల్‌ కాలనీ నుంచి ముడసర్లోవ రిజర్వాయర్‌ వరకు 800 ఎకరాలు పరీవాహక ప్రాంతం. అక్కడ ఎలాంటి సిమెంటు నిర్మాణాలు చేపట్టకూడదన్న న్యాయస్థానం ఆదేశాలు సైతం ఉన్నాయి. అలాంటిచోట రైల్వేజోన్‌కు రాష్ట్రప్రభుత్వం స్థలం ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇవన్నీ తెలియకుండా బొత్స నాలుగు పేపర్లు పట్టుకుని, ‘జీవీఎంసీ, డీఆర్‌ఎం సంయుక్తంగా సర్వేచేశారు. సంతకాలు పెట్టి భూమి అప్పగించాం’ అంటూ ఊదరగొట్టే ప్రయత్నం చేశారు.

బదిలీల్లో అవినీతి లేదట

‘విద్యాశాఖలో జరిగిన బదిలీల్లో ఎలాంటి అవినీతి జరగలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క ఉపాధ్యాయుడినైనా, అసోసియేషన్‌ అయినా వేలెత్తి చూపించమనండి’ అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై బొత్స స్పందించారు. యూనిఫాం తెచ్చినా.. ఏది తెచ్చినా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడే చేస్తున్నామన్నారు. విద్యాశాఖలో ప్రతీ కార్యక్రమం పారదర్శకంగా చేశామన్నారు. పదిలో మంచి ఫలితాలు రావడానికి ఉపాధ్యాయులు కృషి చేశారన్నారు. రాష్ట్రంలోని 96వేల మంది ఉపాధ్యాయులకు వాస్తవాలేంటో తెలుసంటూ చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img