icon icon icon
icon icon icon

అరాచకమా? అభివృద్ధా? ఏది కావాలో నిర్ణయించండి

గుడ్లూరు, స్టోన్‌హౌస్‌పేట, న్యూస్‌టుడే: ‘ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.

Published : 27 Apr 2024 05:45 IST

వైకాపా పాలనలో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి
ఒక్క అవకాశమంటూ సర్వనాశనం చేసిన జగన్‌
‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’లో నందమూరి బాలకృష్ణ

ఈనాడు, నెల్లూరు: గుడ్లూరు, స్టోన్‌హౌస్‌పేట, న్యూస్‌టుడే: ‘ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మడమ తిప్పనంటూనే ప్రజల మెడలు వంచారు. నవరత్నాల పేరుతో నాడులు విరిచారు. ఎన్నికల వచ్చేసరికి ప్రజల సానుభూతి కోసం కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఆడుతున్నారు. ఓటు వేసేముందు ప్రజలు అన్ని విషయాలూ గమనించాలి. ఐదేళ్లలో జరిగిన అరాచకపాలన మళ్లీ కావాలో.. తెదేపా అభివృద్ధి కావాలో ప్రజలే నిర్ణయించాలి’ అని సినీనటుడు, హిందూపురం తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు, నెల్లూరు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కట్టుబట్టలతో బయటకు వచ్చినా.. చంద్రబాబు నాయుడు ఎక్కడా రాజీపడకుండా సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు అందించారన్నారు. ఇప్పుడు 2047 విజన్‌తో ముందుకు వస్తున్నారనీ, ప్రజలంతా ఓటు వేసి దీవించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్‌ రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ.. సిద్ధం సభలు పెడుతున్నారనీ.. అసలు జగన్‌ దేనికి సిద్ధమో ప్రజలు ప్రశ్నించాలన్నారు. యువతకు ఉపాధి లేకుండా చేసినందుకా? గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు చేసినందుకా? ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు చేసిన వారిని కాపాడుతున్నందుకా? తల్లినీ, చెల్లినీ ఇంటి నుంచి బయటకు గెంటేసినందుకా? జే బ్రాండ్‌ మద్యంతో ఎందరో ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచినందుకా.? ప్రకృతి వనరులను దోచినందుకు.. సిద్ధమా? అని నిలదీయాలన్నారు. నవరత్నాల పేరుతో రూ.లక్షల కోట్లు అప్పు చేశారనీ.. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 25 పథకాలను రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ అవినీతి కేసుల్లో ఎ-2గా ఉన్న విజయసాయిరెడ్డి ప్రశాంతంగా ఉండే విశాఖను దోచేశారనీ, ఇప్పుడు అతని చూపు నెల్లూరుపై పడిందన్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతులను ఆదుకోలేదన్నారు.

రైతల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని మొదటిస్థానంలో నిలిపిన ఘనత వైకాపాకే దక్కుతుందన్నారు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన కారు డ్రైవర్‌ను హత్య చేసి డోర్‌ డెలివరీ చేశారని గుర్తు చేశారు. డాక్టర్‌ సుధాకర్‌ మృతికి వైకాపా నేతలే కారణమన్నారు. వైకాపా ఐదేళ్ల పాలనలో.. రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కందుకూరు, నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్‌ అభ్యర్థులు ఇంటూరి నాగేశ్వరరావు, పొంగూరు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img