icon icon icon
icon icon icon

మద్యం డంపు వెనుక మతలబులెన్నో?

కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం పట్టుబడిన భారీ మద్యం డంప్‌ కేసు దర్యాప్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వైకాపా నాయకులను కాపాడేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి.

Published : 28 Apr 2024 06:00 IST

పిఠాపురంలో అక్రమ నిల్వలపై  నోరు మెదపని పోలీసులు
వైకాపా నేతలను తప్పించే ప్రయత్నాలు

పిఠాపురం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం పట్టుబడిన భారీ మద్యం డంప్‌ కేసు దర్యాప్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వైకాపా నాయకులను కాపాడేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. పిఠాపురంలో ఓటర్లకు పంచేందుకు వైకాపా నేతలు నిల్వ చేసిన మద్యం డంపును 4 సెబ్‌ బృందాలు శుక్రవారం నిఘా వేసి పట్టుకున్న సంగతి తెలిసిందే. వాటిని పరిశీలించగా 1,015 డబ్బాల్లో 52,992 సీసాలు పట్టుబడ్డాయి. వాటి విలువ రూ.80 లక్షలు అని పోలీసులు చెప్పగా, రూ.కోటిపైనే ఉంటుందని అంచనా. బాధ్యులైన ముగ్గురు వ్యక్తులను గుర్తించామని, మరో ఇల్లు ఎవరిదో తెలుసుకుంటున్నామని పోలీసులు తొలుత చెప్పారు. ఇంత భారీ డంప్‌ దొరికితే, సాధారణంగా మరుసటి రోజు పోలీసు, ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తారు. ఈ కేసులో శనివారం రాత్రి వరకూ ఎలాంటి పురోగతీ కన్పించలేదు. కుమారపురంలోని వేమగిరి సువార్తమ్మపై పిఠాపురం గ్రామీణ పోలీసు స్టేషన్‌లో, జగ్గయ్యచెరువుకు చెందిన వట్టూరి సతీష్‌కుమార్‌పై పట్టణ ఠాణాలో, సాలిపేటకు చెందిన అంబటి వీర సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌ గార్డెన్స్‌ వాసి గండికోట దుర్గారామయ్యపై ఎక్సైజ్‌ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

అసలు నిందితులను తప్పించి..

వైఎస్సార్‌ గార్డెన్స్‌లో మద్యం దొరికిన ఇల్లు పిఠాపురం పట్టణ వైకాపా అధ్యక్షుడు బొజ్జా దొరబాబు సోదరుడు వీరబాబుది. ఆయన్ను కాదని, అక్కడ పనిచేసే గండికోట దుర్గారామయ్యపై కేసు పెట్టారు. అతను జగ్గంపేట మండలం రాజపూడి వాసిగా తెలుస్తోంది. ఒకరోజు గడిచినా నిందితులను అదుపులోకి తీసుకోకపోవడం, మిగతా మద్యం నిల్వల ఆచూకీకి ప్రయత్నించకపోవడంపై కేసును నీరు గార్చడమేనన్న విమర్శలు వస్తున్నాయి. మద్యం సీసాలపై గోవా లేబుల్స్‌ ఉన్నప్పటికీ.. గోవా నుంచే తరలించారా? లేక స్థానికంగా తయారు చేశారా అన్నదీ తేలలేదు. పోలీసులు కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి, నేరస్థుల గుట్టును బయటకు లాగుతారా అన్నది ప్రశ్నార్థకంగానే కన్పిస్తోంది. మరోపక్క, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ ఆధ్వర్యంలో శనివారం పిఠాపురంలోని మద్యం దుకాణం వద్ద నిరసన తెలిపారు. ‘వంగా గీత లేడీ డాన్‌, మాఫియా డాన్‌, లిక్కర్‌ డాన్‌’ అని ఆరోపించారు. ‘పవన్‌ను ఓడించాలన్న కుట్రలో భాగంగా 20 రోజుల క్రితమే పిఠాపురానికి రూ.6 కోట్ల మద్యం తరలించారు. ఈ కల్తీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందన్నది మా భయం. ఎర్రచందనం, డ్రగ్స్‌ అమ్మేవారంతా పవన్‌ ఓటమి కోసం ఇక్కడికి వచ్చారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వపన్‌ భారీ మెజార్టీతో గెలుస్తారు’ అని వర్మ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img