icon icon icon
icon icon icon

మీకు ఓటేసిన ఎస్సీ,ఎస్టీలనే కాటేస్తారా?

రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలపై సగటున రోజూ ఏడు దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా వైకాపా ప్రభుత్వానికి పట్టడం లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.

Published : 28 Apr 2024 06:03 IST

ఆ వర్గాలపై సగటున రోజూ 7 అఘాయిత్యాలు
వారిని రాజకీయంగా, సామాజికంగా తొక్కేస్తున్న సీఎం
అకృత్యాలను ప్రశ్నిస్తూ జగన్‌కు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల లేఖ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలపై సగటున రోజూ ఏడు దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు జరుగుతున్నా వైకాపా ప్రభుత్వానికి పట్టడం లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఇవేవో గాలిలో సృష్టించిన లెక్కలు కాదని, 2021లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన గణాంకాలని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై పెరిగిన అఘాయిత్యాలతో పాటు వారి అభ్యున్నతిని విస్మరించడాన్ని ప్రశ్నిస్తూ సీఎం జగన్‌కు షర్మిల శనివారం లేఖ రాశారు. ‘గత ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీలు మీపై విశ్వాసం చూపించి అక్కున చేర్చుకున్నారు. అధికారంలోకి వచ్చాక మీరు వారికి మేలు చేయకపోగా కీడు చేస్తున్నారు. దళితుడిని చంపి శవాన్ని డోర్‌ డెలివరీ చేసే అనుయాయులున్న పార్టీ మీది. అంతటి కర్కోటకుడు జైలు నుంచి బెయిల్‌పై వస్తే స్వాగత సత్కారాలతో ఊరేగించే శ్రేణులు మీవి. ఉత్త పుణ్యానికి దళిత మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపితే దిక్కులేని ప్రేమ మీది. మాస్కులు అడిగిన వైద్యుడిని మానసికంగా వేధించి చచ్చేలా చేసిన చేవ మీ వందిమాగధులది. బాపట్లలో దళిత రైతు దంపతులపై కత్తులు దూసిన దుండగులు మీ వాళ్లు. ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన దళిత యువతికి పోలీస్‌ స్టేషన్‌లో శిరోముండనం చేసిన ఘనత మీ కార్యకర్తలది. మీ పార్టీ సీనియర్‌ నేత దశాబ్దాల క్రితం దళితులపై చేసిన దాష్టీకాలకు ప్రస్తుతం శిక్ష పడ్డా.. ఆయన్ను అందలం ఎక్కించడం సిగ్గూ సంస్కారం వదిలేసిన మీ నాయకత్వానికే చెల్లుతుంది. హత్యలు, గూండాయిజం చేసే వారిని మోసే సంస్కృతి మీలో నిలువెల్లా నిండిపోయింది. ఏరు దాటాక తెప్ప తగలేసే మీ బరితెగింపు వాలకాన్ని తట్టుకోలేక మీ పార్టీలోని దళిత నేతలు బయటకు రావడమే ఇందుకు నిదర్శనం’ అని జగన్‌పై షర్మిల నిప్పులు చెరిగారు.

ఇదేనా క్లాస్‌వార్‌ అంటే?

‘పేదలకు, పెత్తందార్లకు మధ్య క్లాస్‌ వార్‌ అంటూనే ఎస్సీ, ఎస్టీలను కోలుకోని విధంగా దెబ్బ తీస్తున్నారు. రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 16.8%, ఎస్టీలు 5.3% ఉన్నారు. మీకు వారు అధికారంలోకి వచ్చాక కనిపించకపోవడం, మళ్లీ ఎన్నికలు రాగానే కనిపించడమన్నది అతిపెద్ద దుర్మార్గం. బడ్జెట్‌లో ఉప ప్రణాళిక కింద ఎస్సీలకు ప్రతిపాదించిన రూ.89,706 కోట్లకు బదులు రూ.66,656 కోట్లే కేటాయించి, రూ.23,050 కోట్లకు గండికొట్టారు. ఎస్టీలకు వాస్తవిక బడ్జెట్‌ రూ.28,990 కోట్లు కాగా, రూ.22,443 కోట్లే కేటాయించి రూ.6,547 కోట్ల మేర కోత పెట్టారు. ఇదీ ఎస్సీ, ఎస్టీలపై మీకున్న చిత్తశుద్ధి’ అని షర్మిల మండిపడ్డారు. ‘ఎస్సీ, ఎస్టీలు రాజకీయంగా ఎదగకుండా వారి అవకాశాలకు కత్తెర వేసి మొగ్గలోనే చిదిమేస్తారా? ఎస్సీ ఎమ్మెల్యేల్లో 12 మంది సిటింగ్‌లకు మీ పార్టీ టికెట్లు నిరాకరించింది. మరో ఆరుగురి స్థానాలు మార్చింది. ప్రజాక్షేత్రంలో వారు రాజకీయంగా స్థిరపడొద్దా? రిజర్వేషన్లు పెంచకుండా, సుప్రీం కోర్టు విధించిన 50% గరిష్ఠ పరిమితిని సడలించకుండా వాల్మీకులను, ఇతర కులాలను ఎస్టీల్లో చేర్చుతామని ఎలా మాటిస్తారు? ఎస్టీలకు జరిగే నష్టాన్ని ఎలా పూరిస్తారు? మీ దగ్గరున్న ప్రత్యామ్నాయమేంటి?’ అని షర్మిల ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img