icon icon icon
icon icon icon

రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడి దౌర్జన్యకాండ

ఎన్నికల వేళ సత్యసాయి జిల్లాలో వైకాపా నాయకుల దౌర్జన్యకాండ పతాక స్థాయికి చేరింది. ఐదేళ్లపాటు ఇష్టారాజ్యంగా దళితులు, బీసీలపై దాడులకు తెగబడ్డ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సోదరులు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా అరాచకాలను కొనసాగిస్తున్నారు.

Published : 28 Apr 2024 06:42 IST

తెదేపాలో చేరిన దళిత ఎంపీటీసీ సభ్యుడిపై దాడి, కిడ్నాప్‌!
వైకాపాలోనే కొనసాగనున్నట్లు ఎమ్మెల్యే సమక్షంలో ప్రకటన

రామగిరి, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ సత్యసాయి జిల్లాలో వైకాపా నాయకుల దౌర్జన్యకాండ పతాక స్థాయికి చేరింది. ఐదేళ్లపాటు ఇష్టారాజ్యంగా దళితులు, బీసీలపై దాడులకు తెగబడ్డ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సోదరులు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా అరాచకాలను కొనసాగిస్తున్నారు. వైకాపాలో జరుగుతున్న వ్యవహారాలు, ప్రకాశ్‌రెడ్డి సోదరుల తీరు నచ్చక రామగిరి మండలం మాదాపురానికి చెందిన దళిత ఎంపీటీసీ సభ్యుడు సంపత్‌ కొద్దిరోజుల క్రితం మాజీమంత్రి సునీత సమక్షంలో తెదేపాలో చేరారు. ఎమ్మెల్యే సోదరుడు రాజారెడ్డి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. శనివారం ఆయన అనుచరులు, వైకాపా నాయకుడు నసనకోట ముత్యాలు గ్రామంలోకి 15 వాహనాల్లో వచ్చి ఎంపీటీసీ సంపత్‌ ఇంట్లోకి చొరబడి ఆయనను బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డు వచ్చిన గ్రామస్థులపై దాడికి పాల్పడ్డారు. చంపేస్తామని బెదిరించారు.

సంపత్‌ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఇదే సందర్భంలో అడ్డుపడిన గ్రామానికి చెందిన దళిత మహిళ లక్ష్మమ్మను, పడిగన్నలపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. చివరకు సంపత్‌ను ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లి తాను వైకాపాలోకి తిరిగి చేరుతున్నట్లుగా బలవంతంగా చెప్పించినట్లు తెలుస్తోంది. తర్వాత సీఐ తన వాహనంలో ఎంపీటీసీని ఎక్కించుకొని వచ్చి కొండాపురం వద్ద రాజారెడ్డి వాహనంలోకి ఎక్కించినట్లు తెదేపా ఆరోపిస్తోంది. ఎంపీటీసీ ఇప్పటికీ ఎక్కడున్నారో తెలియట్లేదు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి పరిటాల సునీత పి.ఆర్‌ కొట్టాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతోపాటు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె తెలిపారు. రాజారెడ్డి, నసనకోట ముత్యాలు ఆయన గన్‌మన్లు దాడిలో పాల్గొన్నారని, ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నట్లు సునీత పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img