icon icon icon
icon icon icon

పీలేరులో తెదేపా ప్రచార రథానికి నిప్పు

అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం విఠలం గ్రామం వద్ద శనివారం తెదేపా ప్రచార వాహనానికి నిప్పుపెట్టారు. డ్రైవరు సీట్లో ఉండగానే వాహనంపై పెట్రోలు పోసి నిప్పు అంటించారు.

Published : 28 Apr 2024 06:08 IST

డ్రైవర్‌ వాహనంలో ఉండగానే పెట్రోలుతో దహనం
మాస్కులు ధరించిన ఇద్దరు దుండగుల దాష్టీకం
వైకాపా పనేనంటూ తెదేపా నేతల ఆరోపణ

ఈనాడు, కడప-వాల్మీకిపురం, న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం విఠలం గ్రామం వద్ద శనివారం తెదేపా ప్రచార వాహనానికి నిప్పుపెట్టారు. డ్రైవరు సీట్లో ఉండగానే వాహనంపై పెట్రోలు పోసి నిప్పు అంటించారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8.30 గంటల సమయంలో వాల్మీకిపురం సమీపంలోని కుందేళ్లవారిపల్లె నుంచి విఠలం గ్రామం వైపు తెదేపా ప్రచార రథం వెళ్తోంది. విఠలం చెరువు సమీపంలో ఉండగా మాస్కులు ధరించి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ప్రచార రథాన్ని అడ్డుకుని సీసాలతో తెచ్చుకున్న పెట్రోలు పోసి నిప్పుపెట్టారు. వాహనంలో ఉన్న డ్రైవర్‌ బాబాచారికి మంటలు వ్యాపించడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బాధితుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి సతీమణి నల్లారి తనూజరెడ్డి తెదేపా శ్రేణులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని అనంతపురం-తిరుపతి జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అనుచరుల పనేనని ఆరోపించారు. సీఐ పులిశేఖర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను పట్టుకుంటామని, ధర్నాను విరమించాలని కోరడంతో తెదేపా శ్రేణులు శాంతించాయి. మాజీ సీఎం, రాజంపేట లోక్‌సభ స్థానం ఎన్డీయే అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆసుపత్రికి చేరుకుని గాయపడ్డ డ్రైవర్‌ను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 24 గంటల్లోగా బాధ్యులను అరెస్టు చేయాలని, లేని పక్షంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

ఓటమి భయంతోనే...

రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం, పీలేరు అసెంబ్లీ స్థానాల్లో వైకాపా ఓటమి ఖాయమై పోయిందని, ఈ విషయాన్ని జీర్ణించుకోలేకనే ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img