icon icon icon
icon icon icon

సచివాలయంలో ఎన్డీయే నేతల మెరుపు ధర్నా

పింఛన్ల పంపిణీ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డి వ్యవహార శైలికి నిరసనగా రాష్ట్ర సచివాలయంలో ఎన్డీయే నేతలు మెరుపు ధర్నా చేశారు. సీఎస్‌, సీఎం కార్యాలయాలు ఉండే భవనం వద్ద మెట్లపై కూర్చొని ఆందోళన చేశారు.

Updated : 28 Apr 2024 07:12 IST

ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై  సీఎస్‌ వైఖరికి నిరసన
సచివాలయం మెట్లపై కూర్చొని ఆందోళన
నాయకులను ఈడ్చిపడేసిన పోలీసులు

ఈనాడు, అమరావతి: పింఛన్ల పంపిణీ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డి వ్యవహార శైలికి నిరసనగా రాష్ట్ర సచివాలయంలో ఎన్డీయే నేతలు మెరుపు ధర్నా చేశారు. సీఎస్‌, సీఎం కార్యాలయాలు ఉండే భవనం వద్ద మెట్లపై కూర్చొని ఆందోళన చేశారు. వినతిపత్రం ఇచ్చిన నేతలకు సీఎస్‌ నుంచి సరైన స్పందన రాకపోవడంతో నాయకులు వెలుపలకు వచ్చి ఆకస్మికంగా ధర్నాకు దిగారు. ‘ఒకటో తేదీన ఇళ్ల వద్దనే పింఛన్లు ఇవ్వాలి.. పేదల ప్రాణాలను బలి తీసుకోవద్దు. సీఎస్‌ జవహర్‌రెడ్డి మొండి వైఖరి నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. మే ఒకటో తేదీన ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా లెక్క చేయకుండా ఆందోళనను కొనసాగించారు. సీఎస్‌ అనుమతితో వచ్చామని నేతలు చెప్పినా వినకుండా పోలీసులు వారిని ఈడ్చి పడేశారు. పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం లేఖ రాసిన నేపథ్యంలో ఎన్డీయే నేతలు సీఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసీ లేఖలో పేర్కొన్న ఆదేశాల ప్రకారం ఉద్యోగుల ద్వారా ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు.

వినతి పత్రంలో ఇలా.. రెగ్యులర్‌ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ఈసీ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని సీఎస్‌కు ఎన్డీయే నేతలు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ‘గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 1.26 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అదనంగా 35వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు ఉన్నారు. ఒక్కొక్కరు 20మందికి పింఛన్లు పంపిణీ చేస్తే రెండు రోజుల్లో పూర్తి చేయవచ్చు’  అని సీఎస్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు మన్నవ సుబ్బారావు, పిల్లి మాణిక్యాలరావు, బుచ్చిరాంప్రసాద్‌, జనసేన నేత రవికృష్ణ నున్నా పాల్గొన్నారు.  


సీఎస్‌ వినే పరిస్థితిలో లేరు

-వర్ల రామయ్య

‘ఎన్నికల కోడ్‌ వచ్చినా ఇంకా రాక్షస పాలన కొనసాగుతూనే ఉంది. సీఎస్‌ స్పందన సరిగా లేదు. ఈసీకి మేము చెప్పుకొంటామని ఆయన అన్నారు. ఆయన వినే పరిస్థితిలో లేరు. సీఎస్‌ ఏదో ప్రభావితమైనట్లుగా ప్రవర్తిస్తున్నారు. సీఎస్‌ దురుద్దేశం, దుర్మార్గపు ఆలోచన కారణంగా  ఏప్రిల్‌ నెలలో పింఛన్లను సచివాలయాల వద్ద పంపిణీ చేయడంతో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈసారి అలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఇళ్లవద్దే పింఛన్లు పంపిణీ చేయాలని కోరితే సిబ్బంది లేరని చెబుతున్నారు. ఈసారి ఒక్క ప్రాణం పోయినా సీఎస్‌ జవహర్‌రెడ్డి, సీఎం జగన్‌ బాధ్యత వహించాలి’ అని  తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.


వైకాపాకు కొమ్ముకాస్తున్న సీఎస్‌

దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి
‘వైకాపా కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన బిల్లులు రూ.13 వేల కోట్లు మార్చి నెలాఖరులో చెల్లించి, ఖజానా ఖాళీ చేశారు. ఏప్రిల్‌ మూడో తేదీ వరకు పింఛన్‌ డబ్బులు విడుదల చేయలేదు. ఓ వృద్ధురాలి శవాన్ని రోడ్డుపైకి తీసుకువచ్చి, శవ రాజకీయాలు చేసేందుకు మంత్రి జోగి రమేష్‌ ప్రయత్నించారు.  సీఎస్‌ జవహర్‌రెడ్డి వైకాపాకు కొమ్ముకాస్తూ ఇంటి వద్దకు పింఛన్లు ఇవ్వడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చూస్తాం. ఆలోచిస్తాం.. అంటున్నారే తప్ప మానవతా దృక్పథంతో ఆలోచించడం లేదు’ అని దేవినేని ఉమా ఆరోపించారు. పింఛన్ల పంపిణీకి సరిపడా సిబ్బంది లేరని సీఎస్‌ మెలిక పెడుతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ మండిపడ్డారు. గత నెలలో సంభవించిన పింఛన్‌దారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, భాజపా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణరాజు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img