icon icon icon
icon icon icon

ప్రోగ్రెస్‌ రిపోర్టు పెట్టాను.. మార్కులు మీరే వేయండి

మ్యానిఫెస్టోను 99 శాతం అమలుచేసిన ఘనత తమకు దక్కుతుందని సీఎం జగన్‌ అన్నారు. చెప్పిన మంచి చేసి చూపించిన తర్వాతనే ప్రజల ఆశీస్సులు కోరేందుకు వచ్చానన్నారు.

Published : 29 Apr 2024 03:49 IST

అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం
విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం
తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు సభల్లో సీఎం జగన్‌
ఈనాడు - తిరుపతి, నెల్లూరు, ఈనాడు డిజిటల్‌ - అనంతపురం

మ్యానిఫెస్టోను 99 శాతం అమలుచేసిన ఘనత తమకు దక్కుతుందని సీఎం జగన్‌ అన్నారు. చెప్పిన మంచి చేసి చూపించిన తర్వాతనే ప్రజల ఆశీస్సులు కోరేందుకు వచ్చానన్నారు. ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. ‘58 నెలల పాలనపై ప్రోగ్రెస్‌ రిపోర్టు మీ ముందు పెట్టాను. మీరే మార్కులు వేయండి. రాబోయే అయిదేళ్లలో పిల్లలు ఆంగ్లమాధ్యమంలోనే చదువుకోవాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటెయ్యాలి’ అని కోరారు. తాడిపత్రి సభలో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదేళ్లలో 133 సార్లు బటన్‌ నొక్కాను. రూ.2.70 లక్షల కోట్లు అక్కాచెల్లెమ్మల ఖాతాలకు జమచేశాను. ఇంటింటా జరిగిన మంచిని, అభివృద్ధిని చూపించి మీ ఆశీస్సులు, దీవెనలు అడుగుతున్నా. సేవల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. పేదింటి పిల్లల కోసం బడుల్లోనే మంచి ఆహారం అందిస్తున్నాం. దుస్తుల నుంచి పుస్తకాలు, డిజిటల్‌ బోర్డులు, ట్యాబులు అందించి విద్యారంగంలో విప్లవాన్ని తీసుకొచ్చాం. ఉద్యోగం కోసం ఇంగ్లిష్‌లో మాట్లాడే విప్లవాత్మక మార్పును తీసుకొస్తాం’’ అని జగన్‌ హామీ ఇచ్చారు.

చేతల్లో చూపించాం

‘‘అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, విద్యాదీవెన, వసతి దీవెన, పేదలకు 31 లక్షల వంటి పథకాలు గతంలో ఎవరైనా ఇచ్చారా? నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలకు 50% రిజర్వేషన్లు అందించాం. మంత్రిమండలిలో 65% పదవులు వారికే ఇచ్చాం. 175 అసెంబ్లీ స్థానాలు, 25ఎంపీ స్థానాల్లో ఏకంగా వందసీట్లు కేటాయించా. జరిగిన మంచిని చూసి దీవెనలు ఇవ్వాలి’’ అని జగన్‌ కోరారు.

మాకు ఓటేస్తేనే పథకాలు.. లేకుంటే ముగింపే

తనకు ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు వేస్తే ఆయన వాటికి ముగింపు పలుకుతారని సీఎం జగన్‌ పేర్కొన్నారు. తాము చేసిన కొన్ని పథకాల పేర్లు చెబుతామని, మీరు చేసిన మంచి ఏమైనా ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు. వెంకటగిరిలోని త్రిభువని కూడలిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, ‘58 నెలల్లో అనేక పథకాలు తెచ్చాం. 2014-19లో జన్మభూమి కమిటీలు ఏర్పాటుచేశారు. 2019లో మేం వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చాం. మీరు పెట్టిన జన్మభూమి కమిటీలపై నమ్మకం ఉంటే మళ్లీ వాటిని తీసుకొస్తానని చెప్పండి’ అని చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ‘నేను రూ.1 అంటే చంద్రబాబు రూ.2 ఇస్తానంటారు. నేను రూ.2 అంటే ఆయన రూ.8 అంటారు. వేలంపాట తరహాలో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. 2014లో ఇదే కూటమి తమ మేనిఫెస్టోను ఇంటింటికీ పంపిణీ చేసింది. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఇదే కూటమి సూపర్‌-6, 7 పేరుతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైంది’ అని జగన్‌ విమర్శించారు.

భద్రతా వైఫల్యం..

వెంకటగిరిలో ఏర్పాటుచేసిన సీఎం హెలిప్యాడ్‌ వద్దకు ఓ వ్యక్తి దూసుకురావడం చర్చనీయాంశమైంది. తిరుగు ప్రయాణమయ్యే సమయంలో డక్కిలి మండలం నాగోలు పంచాయతీ పెద్దయాచ సముద్రానికి చెందిన మాజీ వాలంటీరు పెంచలయ్య బారికేడ్లు దూకి హెలికాప్టర్‌ వద్దకు పరుగులు తీశాడు. భద్రతాసిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.

రానున్న ఐదేళ్లను నిర్ణయించే ఎన్నికలివి

కందుకూరు సభలో మాట్లాడుతూ... ‘ఈ సారి జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. వచ్చే ఐదేళ్లు మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం భవిష్యత్తుని. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకొని ఓట్లు వేయాలి’ అని సీఎం జగన్‌ కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు విజయసాయిరెడ్డి, బుర్రా మధుసూదన్‌యాదవ్‌ పాల్గొన్నారు.


జగన్‌ వస్తున్నారంటే హడల్‌..

సీఎం జగన్‌ పర్యటన అంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. కందుకూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ అయితే.. 12 గంటల నుంచే ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. కందుకూరు ఏరియా ఆసుపత్రిలోకి వెళ్లేందుకు వీల్లేకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టారు.108 వాహనం వస్తే వెనక వైపు వెళ్లాలని సూచించారు. సభ అనంతరం ప్రచారరథాలు పామూరు బస్టాండులో రోడ్డుకు ఇరువైపులా ఉంచి వైకాపా కార్యకర్తలు నృత్యాలు చేస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img