icon icon icon
icon icon icon

సీఎం కనుసన్నల్లోనే మైనింగ్‌ మాఫియా

వైకాపా అధికారంలోకి వచ్చాక క్వారీ యజమానులు, మైనింగ్‌ లీజుదారులను బెదిరించి ఆ పార్టీ నేతలు రూ.కోట్లు దండుకున్నారని ఎన్డీయే నేతలు ఆరోపించారు.

Published : 29 Apr 2024 05:44 IST

ఎన్డీయే నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా అధికారంలోకి వచ్చాక క్వారీ యజమానులు, మైనింగ్‌ లీజుదారులను బెదిరించి ఆ పార్టీ నేతలు రూ.కోట్లు దండుకున్నారని ఎన్డీయే నేతలు ఆరోపించారు. అటవీ, రెవెన్యూ, ప్రభుత్వ భూముల్లో అనుమతుల్లేకున్నా అక్రమంగా ఖనిజ తవ్వకాలు జరుపుతున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్‌, తెదేపా, భాజపాల రాష్ట్ర అధికార ప్రతినిధులు సయ్యద్‌ రఫీ, పి.నాగభూషణం ఆదివారం సంయుక్తంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘ఎన్నికల కోడ్‌ వచ్చాక నెల్లూరులో రూ.400 కోట్ల విలువైన క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు జరిగాయి. ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అరుదైన నలుపు, నీలం రంగు పెరల్‌ గ్రానైట్లు ఉన్నాయి. అక్కడ క్వారీయింగ్‌ను వైకాపా నేతలు అడ్డుకుంటూ కూలీల ఉపాధిని దెబ్బతీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మైనింగ్‌ అధికారి ప్రతాప్‌రెడ్డిని అడ్డుపెట్టుకుని క్వారీల యజమానులను బెదిరిస్తూ రూ.వందల కోట్లు దండుకున్నారు. కొన్ని క్వారీలు ఇప్పటికే మూతపడ్డాయి. అనకాపల్లి జిల్లా మాకవరం పరిధిలో కడపకు చెందిన ఎస్‌జీఎక్స్‌ సంస్థ.. గ్రామపంచాయతీ, పీసీబీ, మైనింగ్‌ శాఖ అనుమతులు లేకున్నా క్రషర్‌ ఏర్పాటుచేసి ఎగుమతులు చేస్తోంది’ అని ఆరోపించారు. ‘అడవుల్లోంచి ప్రకృతి సంపదను కొల్లగొట్టిన కొందరు అడవి దొంగలు ప్రస్తుతం వైకాపాలో ప్రజాప్రతినిధులుగా చెలామణీ అవుతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు టికెట్లిచ్చిన జగన్‌.. అటవీ సంపదను ఎలా పరిరక్షిస్తారు’ అని తెదేపా నేత రఫీ ప్రశ్నించారు. ‘శేషాచలం అడవుల్లోంచి వైకాపా నేతల కనుసన్నల్లో రూ.కోట్ల విలువైన ఎర్రచందనం తరలిపోతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డి నేతృత్వంలో రూ.పది లక్షల కోట్ల విలువైన మూడు లక్షల టన్నుల ఎర్రచందనాన్ని కొల్లగొట్టారు.’ అని రఫీ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img