icon icon icon
icon icon icon

సీఎస్‌, డీజీపీ మీద ఇన్ని ఫిర్యాదులున్నాయా?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి మీద ఇన్ని ఫిర్యాదులున్నాయా? అని కేంద్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్‌మిశ్రా తమ వద్ద ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఎన్డీయే నేతలు తెలిపారు.

Published : 29 Apr 2024 05:47 IST

వైకాపా కార్యక్రమంలో ఐఏఎస్‌ ధనుంజయరెడ్డి ఎలా పాల్గొన్నారు?
ఆధారాలు అందజేయండి  
ఎన్డీయే నేతలను కోరిన కేంద్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్‌మిశ్రా
సీఎస్‌, డీజీపీలను బదిలీ చేయాలి
మిశ్రాకు ఎన్డీయే నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి మీద ఇన్ని ఫిర్యాదులున్నాయా? అని కేంద్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్‌మిశ్రా తమ వద్ద ఆశ్చర్యం వ్యక్తం చేశారని ఎన్డీయే నేతలు తెలిపారు. ఐఏఎస్‌ అధికారి అయ్యుండి వైకాపా మ్యానిఫెస్టో విడుదలలో ధనుంజయరెడ్డి ఎలా పాల్గొన్నారని సీఈవో ముకేశ్‌కుమార్‌ మీనాను ప్రశ్నించినట్టు వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్పింగులను అందజేయాలని కోరినట్టు ఎన్డీయే నేతలు తెలిపారు. తనకూ వీటిపై ఫిర్యాదులు అందాయని రామ్మోహన్‌మిశ్రాకు సీఈవో తెలిపినట్టు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడకు వచ్చిన రామ్మోహన్‌మిశ్రాను తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్‌, భాజపా ముఖ్యఅధికార ప్రతినిధి లంకా దినకర్‌ తదితరులు కలిశారు. సీఎస్‌, డీజీపీ వ్యవహారశైలి, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య, సామాజిక మాధ్యమాల్లో వైకాపా దుష్ప్రచారం, వైకాపా మ్యానిఫెస్టో విడుదలలో సీఎంవో అధికారి ధనుంజయరెడ్డి పాల్గొనడం, ఐపీఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌ అభినందనలు తెలపడంలాంటి వివిధ అంశాలను వివరించారు. వైకాపా సేవలో తరిస్తున్న జవహర్‌రెడ్డి, రాజేంద్రనాథరెడ్డిని ఆ పదవుల్లో కొనసాగిస్తే ఎన్నికల పారదర్శక నిర్వహణే ప్రశ్నార్థకమవుతుందని రామ్మోహన్‌మిశ్రా వద్ద ఎన్డీయే నేతలు ఆరోపించారు. తక్షణం వారిని విధుల్లోంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

సునీల్‌కుమార్‌ను సస్పెండ్‌ చేయాలి

‘దళితులకు మ్యానిఫెస్టోలో ప్రాధాన్యమిచ్చారంటూ సీఐడీ మాజీ అధిపతి సునీల్‌కుమార్‌.. సీఎంకు అభినందనలు తెలిపారు. ఇలాంటి చర్యలు కేంద్ర సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించడమే. తక్షణం ఆయన్ను సస్పెండ్‌ చేయాలి. 13 మంది సీనియర్లను పక్కనపెట్టి తనను డీజీపీని చేసిన జగన్‌ రుణం తీర్చుకోవాలని రాజేంద్రనాథరెడ్డి చూస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైకాపావారు బరితెగిస్తున్నారు. ఇవన్నీ రామ్మోహన్‌మిశ్రాకు వివరించాం’ అని వర్ల రామయ్య తెలిపారు.

ఎన్నికల కమిషనర్‌గా చేసిన వ్యక్తికే ప్రాణభయం

‘గతంలో ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ రాష్ట్రంలో తన ప్రాణాలకు రక్షణ లేదని హైదరాబాద్‌కు వెళ్లారు. తనకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్రానికి లేఖ రాశారు. ఈ ఎన్నికల్లో పంచడానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వైకాపావాళ్లు లిక్కర్‌ డంప్‌లు ఏర్పాటుచేశారు. వాటిని వెలికితీయాలి’ అని రామ్మోహన్‌మిశ్రాను కోరినట్టు వర్ల రామయ్య వివరించారు. అన్నీ సావధానంగా విన్న రామ్మోహన్‌మిశ్రా... మధ్యమధ్యలో సీఈఓను వివరాలు అడుగుతూ తమ ఫిర్యాదులను ధ్రువపరుచుకున్నారని వెల్లడించారు. ‘33 మంది పింఛనర్ల మృతికి జవహర్‌రెడ్డే కారణం. పింఛన్లను ఇళ్ల వద్దే అందించాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను పట్టించుకోలేదు’ అని లంకా దినకర్‌, శివశంకర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో తెదేపా నేతలు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కోడూరి అఖిల్‌, బండారు వంశీ, వల్లూరి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img