icon icon icon
icon icon icon

వారంట్‌ లేకుండా సోదాలు

తెదేపా కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు ఇళ్లు, కార్యాలయంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ఆదివారం ఆకస్మికంగా సోదాలు చేశారు.

Published : 29 Apr 2024 05:49 IST

అధికారులు వైకాపాకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు
ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు

చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: తెదేపా కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు ఇళ్లు, కార్యాలయంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు ఆదివారం ఆకస్మికంగా సోదాలు చేశారు. ఏమీ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. దీనిపై ప్రసాదరావు స్థానిక తెదేపా కార్యాలయంలో విలేకర్లకు ఆయన వివరాలు వెల్లడించారు. ‘ఆదివారం ఉదయం ఏడు గంటలకు 11మందితో కూడిన బృందం మా ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేపట్టింది. సెర్చ్‌ వారంట్‌ చూపకుండా సోదాలు చేసి ఏమీ లేదని చెప్పారు. పంచనామా రాసి సంతకం చేయాలని అధికారులు కోరారు. పంచనామాలో వారంట్‌ లేకుండా సోదాలు చేసినట్లు రాశా. దాంతో 11 గంటలకు సెర్చ్‌వారంట్‌ తీసుకొచ్చి చూపారు. 165 సీఆర్‌పీసీ ప్రకారం సోదాలు చేసి, పంచనామాలో పోలీసు అధికారులు గానీ, జ్యుడిషియల్‌ అధికారులు గానీ సంతకం చేయాలి. అయితే టీపీవో స్థాయి అధికారి సంతకం చేయడం నిబంధనలకు విరుద్ధం. ఎవరో ఉద్దేశపూర్వకంగా సోదాలు చేయించారని స్పష్టమవుతోంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేశాం’ అని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్‌, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సి.ఆర్‌.రాజన్‌, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు మాట్లాడుతూ తెదేపా అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తల ఇళ్లలో సోదాలు చేసి భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని చెప్పారు.

దగ్గుమళ్ల అనుచరులపై దాడి: చిత్తూరు తెదేపా ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అనుచరులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బాధితుల కథనం మేరకు.. దగ్గుమళ్ల తనయుడు రాధేయ్‌ స్నేహితులు సాయి, జగదీష్‌ ఆదివారం ఉదయం నగరి నుంచి చిత్తూరుకు కారులో వస్తూ చిత్తూరు నగరంలోని ఎస్టేట్‌ వద్ద టీ తాగేందుకు ఆగారు. అక్కడ వారితోపాటు కారు డ్రైవర్‌పై కొందరు దాడిచేసి వారి సెల్‌ఫోన్లు లాక్కున్నారు. కాసేపటికి వన్‌టౌన్‌ సీఐ విశ్వనాథరెడ్డి అక్కడకు వచ్చి దాడి చేసినవారి నుంచి బాధితుల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. దాడికి పాల్పడిన వారిని వదిలేసి బాధితులను స్టేషన్‌కు తీసుకెళ్లారని ప్రసాదరావు మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img