icon icon icon
icon icon icon

ఎన్డీయే ఉమ్మడి మ్యానిఫెస్టో నేడు

సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలతో ఇప్పటికే విశేషంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన ఎన్డీయే.. పూర్తిస్థాయి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది.

Published : 30 Apr 2024 06:25 IST

చంద్రబాబు నివాసంలో విడుదల
హాజరుకానున్న తెదేపా, జనసేన, భాజపా నేతలు
ఇప్పటికే సూపర్‌ సిక్స్‌పై విస్తృత ప్రచారం
ఉద్యోగాలు, సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితం
‘నేటి అవసరాలు.. రేపటి ఆకాంక్షలు’ ఇతివృత్తంగా ప్రణాళిక రూపకల్పన

ఈనాడు, అమరావతి: సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలతో ఇప్పటికే విశేషంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన ఎన్డీయే.. పూర్తిస్థాయి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేయనుంది. ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, భాజపా ముఖ్యనేతలు పాల్గొననున్నారు. తెదేపా 11 నెలల క్రితమే రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో సూపర్‌ సిక్స్‌ పేరుతో మినీ మ్యానిఫెస్టోను ప్రకటించింది. జనసేనతో పొత్తు ఖరారయ్యాక ఆ పార్టీతో సంప్రదించి మరికొన్ని హామీలను జోడించింది. తెదేపా, జనసేన, భాజపా (ఎన్డీయే) పొత్తు ఖాయమయ్యాక మూడు పార్టీల నేతలు ఉమ్మడి మ్యానిఫెస్టోపై సుదీర్ఘ కసరత్తు చేశారు. ‘నేటి అవసరాలు తీరుస్తాం- రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం’ అన్న ఇతివృత్తంతో దీన్ని రూపొందించారు. సమాజంలోని అన్నివర్గాల అభ్యున్నతికి మరిన్ని కొత్త పథకాలను ఎన్డీయే ప్రకటించనుంది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం అమలు చేసి, వైకాపా రద్దు చేసిన పథకాల పునరుద్ధరణకు హామీ ఇవ్వనుంది. అన్న క్యాంటీన్‌లు, పండుగ కానుకలు వంటివి వీటిలో ఉండనున్నాయి. ‘అధిక పన్నులు, భారాల బాదుడు లేని సంక్షేమం- ప్రతి ప్రాంతంలో అభివృద్ధి’ అన్నది ప్రధానాంశంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్టు ఎన్డీయే వర్గాలు తెలిపాయి. ‘అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదు. మా మ్యానిఫెస్టో సంపద సృష్టించి ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమం అందజేస్తామన్న భరోసానిస్తుంది. రానున్న ఐదేళ్లకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణను ప్రకటిస్తుంది. ప్రజల వ్యక్తిగత జీవితాల్లోనూ మార్పు తెచ్చేలా పథకాలు, కార్యక్రమాలకు అద్దం పడుతుంద’ని ఎన్డీయే వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే విస్తృతంగా ప్రజల్లోకి

ఎన్డీయే పక్షాలు ఇచ్చిన హామీలు, ప్రకటించిన పథకాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. గతేడాది మహానాడులో ‘సూపర్‌ సిక్స్‌’ ప్రకటించిన తర్వాత తెదేపా ‘భవిష్యత్తుకు భరోసా’ పేరుతో విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేపట్టింది. లోకేశ్‌ ప్రజాగళం పాదయాత్రలో సూపర్‌ సిక్స్‌పై వివిధ వర్గాలతో చర్చలు నిర్వహించారు. తెదేపా కార్యకర్తలు పలు దఫాలు ఇంటింటికీ వెళ్లి ఈ పథకాలను వివరించారు. కరపత్రాలు ముద్రించి పంచారు. ఎన్నికల ప్రచారంలోనూ ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రింట్‌, టీవీ, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల రూపంలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.

నేటి పవన్‌ రోడ్‌ షో రద్దు

పిఠాపురం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళవారం నిర్వహించాల్సిన రోడ్‌షో రద్దయింది. ఆయన విజయవాడలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్తున్న నేపథ్యంలో రోడ్‌షో రద్దు చేసినట్లు జనసేన పార్టీ ఎన్నికల సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.


ఎన్డీయే ఇప్పటికే ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనవి

  • మెగా డీఎస్సీపై మొదటి సంతకం.
  • సామాజిక పింఛను రూ.4 వేలకు పెంపు. ఇది 2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు. ఇంటి వద్దే నగదు అందజేత.
  • దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు.
  • బీసీలకు 50 ఏళ్లకే పింఛను.
  • ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత.
  • యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.
  • నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి.
  • ‘తల్లికి వందనం’ కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.
  • రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.
  • వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు.
  • ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల  ఇంటి స్థలం. నాణ్యమైన సామగ్రితో మంచి ఇంటి నిర్మాణం.
  • ఇసుక ఉచితం.
  • బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం.
  • ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.
  • పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల ఏర్పాటు.
  • భూ హక్కు చట్టం రద్దు.
  • కరెంటు ఛార్జీలు పెరగవ్‌.
  • చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200,   మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌.
  • పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.
  • విదేశీ విద్య పథకం పునరుద్ధరణ.
  • పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.
  • నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ.
  • రైతులకు గతంలో తెదేపా ప్రభుత్వం అందించిన రాయితీ పథకాల పునరుద్ధరణ.
  • ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ.
  • చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img