icon icon icon
icon icon icon

మండుటెండల్లో మళ్లీ మరణ మృదంగమా?

పింఛను కోసం ఏప్రిల్‌లో వృద్ధులను సచివాలయాల చుట్టూ తిప్పిన సీఎం జగన్‌, సీఎస్‌, ఉన్నతాధికారులు కలిసి మళ్లీ కుట్రకు తెరలేపారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు.

Published : 30 Apr 2024 06:25 IST

పండుటాకులను బ్యాంకుల చుట్టూ తిప్పిస్తారా?
ఇంటి వద్ద పింఛను ఇవ్వమంటే ఇదేం పద్ధతి?
జగన్‌ కుతంత్రాలకు జవహర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, శశిభూషణ్‌ల సహకారం
33 మంది మరణాలకు కారణమైన సీఎం, సీఎస్‌పై కేసు పెట్టాలి
తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌
ఈనాడు - కర్నూలు

పింఛను కోసం ఏప్రిల్‌లో వృద్ధులను సచివాలయాల చుట్టూ తిప్పిన సీఎం జగన్‌, సీఎస్‌, ఉన్నతాధికారులు కలిసి మళ్లీ కుట్రకు తెరలేపారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మే నెలలోనూ మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎంతమంది చనిపోయినా పర్లేదన్న ధోరణితో ముఖ్యమంత్రి శవ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా గూడూరులో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘పింఛను బ్యాంకులో పడిందా? లేదా? అనేది లబ్ధిదారులకెలా తెలుస్తుంది? వృద్ధులు సెల్‌ఫోన్లో మెసేజ్‌లు చూసుకోగలరా? వారి అవసరాలకు డబ్బులందకుండా చేసి ప్రతిపక్షాలపై నిందలేయాలని చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఆయన పలు ప్రశ్నలు సంధించారు.

అన్నీ నాటకాలే..

‘ఇంటి వద్దే పింఛన్ల పంపిణీకి నాటకాలాడుతున్నారు. గవర్నరు, ఎన్నికల కమిషన్‌, సీఎస్‌ను కలిసి ఈ మేరకు మేము వినతిపత్రాలిచ్చాం. ఎన్నికల కమిషన్‌ స్పందించి ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని, ఆమోదయోగ్యంగా అమలు చేయాలని ఆదేశించింది. విషాద సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలంది. ఇప్పుడు కిలోమీటర్ల దూరమున్న బ్యాంకుల వద్దకు ఎండలో వెళ్లి వృద్ధులు పడిగాపులు కాయాలా? గ్రామస్థాయిలో పింఛన్ల పంపిణీకి 1.26 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఐదు వేల మంది చొప్పున వెలుగు, వ్యవసాయ శాఖ సిబ్బంది, మూడు వేల మంది ఉద్యానశాఖ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వీరంతా కలిస్తే ఒక్కో ఉద్యోగి ఇచ్చే పింఛన్ల సంఖ్య 45లోపే ఉంటుంది. గ్రామాల్లో పనిచేసే ఉద్యోగులకు పింఛనర్లు ఎక్కడున్నారో తెలుస్తుంది. ఒక రోజులో ఇవ్వలేకపోతే రెండు రోజుల్లో ఇస్తారు. అయినప్పటికీ పింఛన్లు ఇవ్వడానికి సాకులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్‌ చెప్పినా మొండికేస్తున్నారు. ఇదేమంటే వారికి ఇళ్లు తెలియవని అసంబద్ధంగా చెబుతారు. సచివాలయాల్లోని 41,230 మంది బీఎల్వోలకు ఓటరు స్లిప్పులు అందజేసే పనులున్నందున సమయం లేదని అంటున్నారు. తొలుత వారితో పింఛన్లు ఇప్పిస్తే తరువాత స్లిప్పులు ఇవ్వడమూ సులువవుతుంది. మే 13న ఎన్నికలైతే ఒకటో తేదీ నుంచే ఓటరు స్లిప్పులు పంచలేరు కదా?

సీఎస్‌ కార్యాలయం వద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి

ఇంటి వద్దే పింఛను ఇవ్వాలంటూ సీఎస్‌ కార్యాలయం ముందు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది.  ఎన్నికల ప్రకటన వచ్చాక యంత్రాంగం నిష్పాక్షికంగా పనిచేయాలి. సీఎంకూ వ్యక్తిగతంగా మేలు చేయవద్దు. ముఖ్యమంత్రి కుట్రలు, కుతంత్రాలు పన్నితే అధికార యంత్రాంగం అమలుచేస్తోంది. ఇది క్షమించరాని నేరం. ఆరోపణలున్న అధికారులు ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ఎన్నికల విధులకు అనర్హులు. పింఛన్లు పంపిణీ చేయలేని అసమర్థ అధికారులు ఎన్నికలు నిర్వహించగలరా? ఎలా రక్షణ కల్పిస్తారు? దీనిపై ఎన్నికల కమిషన్‌ అప్రమత్తంగా ఉండాలి. వాలంటీర్లనూ నాశనం చేస్తున్నారు. ఎన్డీయే వస్తే ఒక్కొక్కరికి నెలకు రూ.10 వేల వేతనమిస్తామంటే అదీ చెప్పడం లేదు. వేల మందితో రాజీనామా చేయించారు. అధికారంలోకి వస్తే మళ్లీ నియమిస్తామంటున్నారు. ఎందుకు ఊడిగం చేయించుకోవడానికా?’ అని ప్రశ్నించారు.


ఏప్రిల్‌ నుంచి డ్రామాలు, కుట్రలే

ప్రిల్‌ 1న పింఛన్లకు డబ్బులేక.. మూడో తేదీన పంపిణీ ప్రారంభిస్తామంటూ మార్చి 28న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ వద్దని మార్చి 29న ఎన్నికల సంఘం ఆదేశించింది. వాలంటీర్ల ద్వారా ఇవ్వడం లేదంటూ వృద్ధులను తిప్పించింది. డబ్బుల్లేవని తెలిసినా ఏప్రిల్‌ 1నుంచే వైకాపా నాయకులు వృద్ధులను నడిపించుకొచ్చారు. కష్టపెడుతూ కనీసం మంచినీళ్లు, మజ్జిగ ఇవ్వలేదు. డ్రామాలు, కుట్రలకు పాల్పడ్డారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల వివరాల్లేవని గత నెలలో ప్రభుత్వం చెప్పింది. మే నెలకు సంబంధించిన పింఛను సొమ్మును ఖాతాల్లో వేస్తామని ఇప్పుడంటోంది. అప్పుడు లేని బ్యాంకు ఖాతా వివరాలు ఇప్పుడెలా వచ్చాయి? రాష్ట్రంలో 65.49 లక్షల పింఛనర్లు ఉండగా 48.92 లక్షల మందివి లింకులు దొరికాయని అంటున్నారు. 75 శాతం మందికి బ్యాంకులో వేసి మిగిలిన 16.57 లక్షల మందికి ఇళ్లకు వెళ్లి ఇస్తామంటున్నారు. వాళ్ల చిరునామాలు మీ వద్ద ఉన్నాయా? 25 లక్షల మందికి అనారోగ్యం ఉందని ఎలా తెలిసిందో చెప్పాలి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప మోసం చేయకూడదు.


  • ‘ఇంటింటికి వెళ్లి పింఛను ఇవ్వాలని కోరాం. ప్రభుత్వం సచివాలయాల వద్దకు రమ్మంటోంది. బ్యాంకులకు వెళ్లమంటోంది. ఒకటో తేదీన తెల్లవారుజామునే ఇళ్లకు వెళ్లి ఇచ్చామని గొప్పలు చెబుతారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతో ఎందుకు ఇప్పించలేరు? ఇవ్వకూడదా? మొండెద్దు మొండికేసిందా? ముల్లుకర్రతో పొడిచినా లాభం లేదా? ఈ మొండెద్దును వదిలించుకుందాం’.
  •  ‘ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీ సందర్భంగా 33 మంది మరణాలకు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే బాధ్యులు. వారిద్దరిపైనా కేసులు పెట్టాలి. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం అందించాలి. మే నెలలో పంపిణీ సందర్భంగా ఏదైనా జరిగినా, ఎవరైనా చనిపోయినా ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తాం. జవహర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, శశిభూషణ్‌లే బాధ్యత వహించాలి’.
  • ‘ఎన్డీయే అధికారంలోకి వస్తే ఏప్రిల్‌నుంచే పింఛనుదారులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేల చొప్పున ఇస్తామన్నాం. మేం వచ్చేది జూన్‌లో అయినా అప్పటివరకు బకాయిలు కలిపి (జులై 1న రూ.7 వేల చొప్పున) ఇస్తామన్నాం. జగన్‌ వస్తే 2028 ఏప్రిల్‌లో రూ.250, 2029 ఏప్రిల్‌లో రూ.250 పెంచి ఇస్తామంటున్నారు. ఈ నెల నుంచి రూ.4 వేలకు పెంచి ఇస్తామంటుంటే జగన్‌ 2028, 2029 ఏప్రిల్‌లలో అంటున్నారు. ఆదుకునే విధానం మాది. మోసం చేసే నైజం జగన్‌ది.’
  • ‘బాబాయ్‌ను గొడ్డలితో హత్య చేయించినట్లే వృద్ధులకు ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వకుండా తిప్పితిప్పి చంపేయించేందుకు కుట్ర చేస్తున్నారు. గులకరాయి రాజకీయం చూశారుగా? ఎక్కడైనా గులకరాయి కనిపించిందా? ఎవరో హత్యాయత్నం చేస్తారని కొత్తగా చెబుతున్నారు. రాజకీయమంటే ఫ్యాన్సీ అయింది.

 కర్నూలు జిల్లా గూడూరులో తెదేపా అధినేత చంద్రబాబు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img