icon icon icon
icon icon icon

జగన్‌కు పొలిటికల్‌ హాలిడే ఇచ్చేద్దాం

అరాచకం తప్ప అభివృద్ధి చేయని జగన్‌కు పొలిటికల్‌ హాలిడే ఇచ్చేద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న మీరు ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలంటూ ప్రజల్ని ఉత్సాహపరిచారు.

Published : 30 Apr 2024 06:25 IST

ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలి
ఈ ప్రభుత్వం ఆక్వా రైతును నిండా ముంచింది
అవినీతిలో రాటుదేలిన ‘కొట్టు’కు బుద్ధిచెప్పాలి
తాడేపల్లిగూడెం, గణపవరం వారాహి విజయభేరి సభల్లో పవన్‌ కల్యాణ్‌

ఈనాడు- ఏలూరు, కాకినాడ, ఈనాడు డిజిటల్‌- భీమవరం: అరాచకం తప్ప అభివృద్ధి చేయని జగన్‌కు పొలిటికల్‌ హాలిడే ఇచ్చేద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న మీరు ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలంటూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలలో సోమవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలు, పిఠాపురం రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. ‘మన భూములు దోచుకోవడానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాదరకమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తీసుకొస్తున్నార[ు. దీని ప్రకారం మీ ఆస్తుల ఒరిజినల్‌ పత్రాలు జగన్‌ దగ్గర పెట్టుకుని యజమానులకు జిరాక్సులు మాత్రమే ఇస్తారు. మీ ఆస్తుల వివరాలన్నీ హైదరాబాద్‌ నానక్‌రామగూడలోని వైకాపా ప్రైవేటు స్థావరంలో దాచిపెడుతున్నారు. ఈసారి వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులను మీరే పెట్రోల్‌ పోసి తగలపెట్టుకున్నట్టే’ అని హెచ్చరించారు. ‘కేంద్రం ఇచ్చే పాస్‌పోర్టుపై కూడా ప్రధాని చిత్రం ఉండదు. దేశ రాజముద్ర మాత్రమే ఉంటుంది. రాష్ట్రంలో ప్రజల భూమి పత్రాలపై జగన్‌ ఫొటో ఎందుకు?’ అని ప్రశ్నించారు. మీ పిల్లల భవిష్యత్తు కోసమే నేను ఇప్పుడు పోరాడుతున్నానని యువతతో చెప్పారు. ‘జగన్‌ నాడు- నేడు పేరుతో విద్యావ్యవస్థను ఉద్ధరించారని చెబుతున్నారు. వైకాపా పాలనలో 4,709 పాఠశాలలు మూతపడ్డాయి. 3.9 లక్షల మంది విద్యార్థులు బడికి దూరమయ్యారు. ఏపీలో 5-18 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు 62 వేల మంది చనిపోయారు’ అని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే సీపీఎస్‌ సమస్యపై అసెంబ్లీలో బలమైన చర్చ జరిపి, పరిష్కారం కోసం పోరాడతామన్నారు.

జగన్‌ ఆక్వా రైతును నిండా ముంచారు

‘ఆక్వా రంగాన్ని జగన్‌ నిండా ముంచారు. తెదేపా ప్రభుత్వం యూనిట్‌ విద్యుత్తు రూ.1.5కే అందిస్తే జగన్‌ రూ.5కి పెంచారు. గతంలో రూ.1600 ఉన్న మేత జగన్‌ ప్రభుత్వంలో రూ.2,750కి పెరిగింది. గిట్టుబాటు ధర లేక ఆక్వా రైతు కిలో రొయ్యకు రూ.50 వరకు నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆక్వా రైతును ఆదుకుంటాం.  గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏలూరు కాలువ పూడిక కూడా తీయలేకపోయింది. నీటి సమస్య ఉన్న గ్రామాలకు పోలవరం కాలువ నుంచి నీరు సరఫరా చేస్తాం. ఆపరేషన్‌ కొల్లేరులో ధ్వంసమై, పరిహారం రాని జిరాయితీ భూములకు పరిహారం అందేలా చూస్తాం’ అని హామీ ఇచ్చారు. ‘రాష్ట్రంలో రహదారులు చూస్తేనే భయమేస్తోంది. ఈ రహదారుల్లో అంబులెన్సులు కూడా ప్రయాణించలేక ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. ఎన్నికలొచ్చే సమయానికి మాత్రం జగన్‌ మీ ఇంట్లో బిడ్డను.. తండ్రిలేని బిడ్డను అంటూ ఓట్లడుగుతున్నారు. ఆ బిడ్డ అధికారంలోకి రావాలంటే ఎవరో ఒకరు చావాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు జూదక్లబ్‌ బాగా నిర్వహిస్తున్నారని అభినందిస్తూ సీఎం ఆయనకు రూ.30 లక్షల విలువైన కారు బహుమతిగా ఇచ్చారు. ఆ ఎమ్మెల్యే తన ఇంటికి కూడా రోడ్డు వేయించుకోలేకపోయారు. పోలవరం కుడికాలువను కొల్లగొట్టి అమ్ముకుంటున్నారు. శ్రీశైల మల్లికార్జునుడికి మహా కుంభాభిషేకం చేస్తే జగన్‌కు పదవీగండం ఉందని దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ దాన్ని వాయిదా వేయించేశారు. ఒంటిమిట్టకు ప్రొటోకాల్‌ ప్రకారం తాను వెళ్లకుండా.. ఇసుక, గనుల దోపిడీదారు పెద్దిరెడ్డిని పంపారు. పెత్తందార్ల మోచేతి నీళ్లు తాగే ఈ ఎమ్మెల్యే.. జనాన్ని దోచుకుంటున్నారు. మీ గుండెల్లో జ్యోతిని వెలిగించండి.. ఆ వెలుగులో కొట్టు సత్యనారాయణ అవినీతి దహించుకుపోవాలి’ అని ధ్వజమెత్తారు. ‘తాడేపల్లిగూడెంలో నిత్యావసర వస్తువుల రవాణా రంగం ఉంది. పక్క రాష్ట్రాలతో మాట్లాడి గ్రీన్‌టాక్స్‌ తగ్గేలా చూస్తాం. కూటమి వస్తే తాడేపల్లిగూడేన్ని ఎడ్యుకేషన్‌, మార్కెట్‌ హబ్‌గా మారుస్తాం’ అని హామీ ఇచ్చారు.


భవననిర్మాణ కార్మికుల సంక్షేమనిధికి రూ.కోటి విరాళం

వన నిర్మాణ కార్మికుల సంక్షేమనిధినీ జగన్‌ దోచుకున్నారని పవన్‌ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. సంక్షేమనిధికి వ్యక్తిగతంగా రూ.కోటి విరాళం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img