icon icon icon
icon icon icon

వైకాపా నేతల బరితెగింపు!

పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో వైకాపా నేతలు బరి తెగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలపై వాలంటీర్లతో ఇంటింటా విష ప్రచారం చేయిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే పథకాలు రద్దవుతాయని.. వైకాపాను గెలిపిస్తేనే సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని వారితో చెప్పిస్తున్నారు.

Published : 30 Apr 2024 05:44 IST

రాజీనామా చేయాలని వాలంటీర్లపై తీవ్రంగా ఒత్తిడి
ఒకేరోజు 615 మందితో రాజీనామా చేయించిన నేతలు
15 రోజులకు రూ.25 వేల చొప్పున నజరానా

ఈనాడు, అమరావతి: పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో వైకాపా నేతలు బరి తెగిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలపై వాలంటీర్లతో ఇంటింటా విష ప్రచారం చేయిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే పథకాలు రద్దవుతాయని.. వైకాపాను గెలిపిస్తేనే సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని వారితో చెప్పిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటివరకు రాజీనామా చేయకుండా దూరంగా ఉన్న వాలంటీర్లను తమతో కలిసి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 79,865 మంది వాలంటీర్లు రాజీనామా చేసి వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో మిగిలిన వాలంటీర్లతోనూ రాజీనామాలు చేయించేలా వైకాపా నేతలు పావులు కదుపుతున్నారు. రాజీనామా చేయాలని వాలంటీర్ల వ్యక్తిగత సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పెట్టడంతోపాటు మండల, నియోజకవర్గాల వారీగా వారితో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. తీవ్రంగా ఒత్తిడి తెచ్చి సోమవారం ఒకేరోజు 615 మంది వాలంటీర్లతో వైకాపా నేతలు రాజీనామా చేయించారు. 

వాలంటీర్లతో రహస్య సమావేశాలు

వైకాపా మ్యానిఫెస్టో తేలిపోవడంతో ఆ పార్టీ నేతల నుంచి శ్రేణుల వరకు నీరుగారిపోయారు. పాతవి కొనసాగించడం తప్పితే కొత్తగా ఏమీ లేకపోవడంతో ప్రజల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది గమనించిన వైకాపా పెద్దలు ఇంటింటికీ మ్యానిఫెస్టో ప్రచారం పేరుతో ప్రతిపక్ష పార్టీలపై బురద జల్లడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్‌, బాపట్ల, చిత్తూరు, వైయస్‌ఆర్‌, అనంతపురం జిల్లాల్లో ఆదివారం రాత్రి వాలంటీర్లతో వైకాపా నేతలు రహస్య సమావేశాలు నిర్వహించి వాలంటీర్లకు మార్గదర్శనం  చేశారు. రాజీనామా చేసిన ఒక్కో వాలంటీర్‌కు రూ.25 వేల చొప్పున చెల్లిస్తామని ప్రలోభ పెట్టారు. విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని మండలాల్లో వాలంటీర్లకు సోమవారం నజరానాలు పంపిణీ చేశారు.

ఓటర్ల వివరాలపైనా ఆరా

మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనుండటంతో వైకాపా నేతలు వాలంటీర్లతో కలిసి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేకించి నగరాలు, పట్టణాల్లోగల అపార్ట్‌మెంట్లు, గ్రూపు హౌస్‌ల వద్దకు వెళ్లి అక్కడ ఎవరు ఉంటున్నారు? ఏం చేస్తుంటారు? ఓటు హక్కు స్థానికంగానే ఉందా? వేరొక ప్రాంతంలో ఉందా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఓటు హక్కు ఉన్నట్లయితే అలాంటి వారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. వాలంటీర్ల వద్ద వారి పరిధిలోని కుటుంబాల సమాచారం ఉన్నప్పటికీ...గత రెండు నెలల్లో ఎవరైనా ఇళ్లు మారారా? కొత్త వాళ్లు చేరితే ఆ వివరాలేంటో వాలంటీర్ల ద్వారా వైకాపా నేతలు తెలుసుకుంటున్నారు. పోలింగ్‌కు ఒకట్రెండు రోజుల ముందు ఓటర్లకు నజరానాల పంపిణీ కోసమే వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతిలో సోమవారం నుంచి ఓటర్ల వివరాలు సేకరించే ప్రక్రియ మొదలైంది. వైకాపా నేతలతో ఇప్పటికీ రాజీనామా చేసిన వాలంటీర్లతోపాటు విధుల్లో ఉన్నవారు కూడా పాల్గొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img