icon icon icon
icon icon icon

ఎన్డీయేకు 400 స్థానాలు ఖాయం

ఎన్నికల్లో భాజపా ఒంటరిగా 370, ఎన్డీయే పక్షాలతో కలిపి 400కు పైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Published : 30 Apr 2024 05:59 IST

‘వికసిత్‌ భారత్‌’ సాకారంలో యువత కీలకం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ఎన్నికల్లో భాజపా ఒంటరిగా 370, ఎన్డీయే పక్షాలతో కలిపి 400కు పైగా లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో సుస్థిర నిర్ణయాలు అమలుచేసే ప్రభుత్వ ఏర్పాటుకు ఈ సంఖ్య తోడ్పడుతుందని అన్నారు. విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘వికసిత్‌ భారత్‌ క్యాంపస్‌ అంబాసిడర్‌’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలోనే మేటిగా నిలపడానికి ప్రధాని మోదీ ‘వికసిత్‌ భారత్‌’ కార్యక్రమానికి పిలుపునిచ్చారని, దీని సాకారంలో యువత పాత్ర కీలకమని అన్నారు. ‘మోదీ నేతృత్వంలో జీడీపీలో భారత్‌ పదో స్థానం నుంచి అయిదో స్థానానికి చేరుకుంది. అభివృద్ధిలో ఇప్పటికీ వెనకబడి ఉన్నామన్న విమర్శలకు ఇదే సమాధానం. అయిదేళ్లలో జీడీపీ పరంగా దేశాన్ని మూడో స్థానంలో నిలపడానికి ప్రణాళికలు రూపొందించాం. డిజిటల్‌ లావాదేవీలు అవసరమా? అని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తరచూ ప్రశ్నిస్తున్నారు. అంతటా విస్తరించిన డిజిటల్‌ చెల్లింపులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 131 బిలియన్లకు చేరుకున్నాయి. బడ్జెట్‌లో రూ.లక్ష కోట్లను వివిధ రంగాల్లో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు కేటాయించాం. రూ.22 వేల కోట్ల రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతున్నాం. జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌ కింద 2047నాటికి ఇంధన స్వాతంత్య్రం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశ సామర్థ్యాలను తక్కువ చేసి మాట్లాడే ప్రతికూల శక్తులపై నిరంతరం పోరాడుతున్నాం’ అని వివరించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌, వర్సిటీ ఉపకులపతి ఆచార్య దయానంద సిద్దవటం, ప్రొ వైస్‌ఛాన్సలర్‌ ఆచార్య గౌతమరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య గుణశేఖరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img