icon icon icon
icon icon icon

కుట్రల కూటమితో యుద్ధం

‘‘రెండు వారాల్లో జరిగే కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవసైన్యం, దుష్టచతుష్టయం, చంద్రబాబు, ఆయనకు మద్దతుగా ఉన్న రెండు జాతీయపార్టీలు, దత్త పుత్రుడితో కూడిన కుట్రల కూటమితో యుద్ధం చేస్తున్నాం’’ అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

Published : 30 Apr 2024 06:02 IST

ఎవరివల్ల మేలు జరిగితే వాళ్లకే ఓటు వేయండి
పేదలకు మంచి చేసినందుకే నన్ను ఓడించాలా?
చోడవరం, అంబాజీపేట, పొన్నూరు సభల్లో సీఎం జగన్‌

ఈనాడు-అమరావతి, రాజమహేంద్రవరం, అనకాపల్లి: ‘‘రెండు వారాల్లో జరిగే కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవసైన్యం, దుష్టచతుష్టయం, చంద్రబాబు, ఆయనకు మద్దతుగా ఉన్న రెండు జాతీయపార్టీలు, దత్త పుత్రుడితో కూడిన కుట్రల కూటమితో యుద్ధం చేస్తున్నాం’’ అని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట, అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారసభల్లో ఆయన మాట్లాడారు. చోడవరం సభలో మాట్లాడుతూ, ‘2014లో చంద్రబాబు ఇప్పుడున్న కూటమిలో ముగ్గురి ఫొటోలు పెట్టి ప్రతి ఇంటికీ పంపించిన పాంప్లెట్ గుర్తుందా..? హైదరాబాద్‌ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది, ఏమైంది? గోవిందా.. గోవింద. దిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ గోవిందా..గోవిందా. సింగపూర్‌ని మించిన రాజధాని అని పక్కనే అన్ని హబ్‌లతో కనిపించిన వైజాగ్‌ను వదిలేశారు.. మరి ఆ గ్రాఫిక్స్‌ రాజధాని ఏమైంది.. గోవిందా! ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి’ అన్నారు. ‘ఓటుకు రూ.2-5 వేలు ఇస్తారు.. వద్దనకండి తీసుకోండి. ఓటేసే ముందు ఆలోచించి ఎవరివల్ల మేలు జరిగిందో వారికే ఓటు వేయండి’ అని సీఎం కోరారు. కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థికరణం ధర్మశ్రీ, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, గాజువాక అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌, ఎంపీలు గొల్ల బాబూరావు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్‌ ప్రయాణికులకు పట్టపగలే చుక్కలు చూపించారు. చోడవరం ప్రధాన రహదారిపై రోడ్‌షో ఏర్పాటు చేయడంతో ఇరువైపులా పది కి.మీ. ముందే వాహనాలను నిలిపేశారు. దీంతో ప్రయాణికులంతా పిల్లా పాపలతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం హెలికాప్టర్‌ ప్రయాణానికి అడ్డుగా ఉన్నాయని విద్యుత్తు తీగలను కట్‌చేయడంతో కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

జగన్‌ను ఎందుకు ఓడించాలి?

పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట సభలో మాట్లాడుతూ, ‘ఈ ఎన్నికల్లో జగన్‌ను ఎందుకు ఓడించాలి.. బాబుకు ఎందుకు ఓటేయాలో మీరు చెప్పండి. 2014 ఎన్నికల ముందు వాళ్లు ఏం చెప్పారు? ఏం చేశారో తెలిసీ ఓటేస్తారా?’ అని జగన్‌ ప్రజలను ప్రశ్నించారు. ‘గడిచిన 58 నెలల్లో పేదలకు మంచి చేసినందుకా? ఇచ్చిన మాట తప్పనందుకా? రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లంచాలు, వివక్ష లేకుండా అందజేసినందుకా ఓడించాలి’ అని ప్రశ్నించారు.

ఇలా.. ఇలా.. అంటూ నవ్వులపాలు

జగన్‌ తన ప్రసంగంలో.. 2014లో తెదేపా ముద్రించిన హామీల కరపత్రంలో ఒక్కో అంశం చదువుతూ.. మీరంతా ఇలా.. ఇలా.. అంటూ చేతులు ఊపాలని (అరచేయి అడ్డంగా ఊపడం) పదే పదే చెప్పించే ప్రయత్నం చేసి నవ్వులపాలయ్యారు. ముఖ్యమైన హామీలు చదువుతూ ప్రత్యేకహోదా తెచ్చారా? అనగానే.. మరి నువ్వుకూడా తేలేదుగా అంటూ హాజరైనవారిలో కొందరు వ్యాఖ్యానించడం వినిపించింది. మేలు చేసే ఫ్యాన్‌ ఇంట్లో, సైకిల్‌ బయట, తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లో ఉండాలన్నారు. పి.గన్నవరం అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్‌, అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ను ప్రజలకు పరిచయం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం వస్తారనగా, ఉదయం 10 గంటల నుంచే అంబాజీపేట వైపు వచ్చే బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో దాదాపు 10 కిలోమీటర్ల మేర ఇబ్బంది ఎదురైంది. మండుటెండలో ట్రాఫిక్‌ ఆంక్షలతో అంతా ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆలోచించి ఓటేయాలి

గుంటూరు జిల్లా పొన్నూరు సభలో మాట్లాడుతూ, పేదవారికి మంచి చేయని కూటమితో జగన్‌ ఒక్కడే యుద్ధం చేస్తున్నారని చెప్పారు. రాబోయే అయిదేళ్లలో ఇంటింటి అభివృద్ధి, పేద కుటుంబాల భవిష్యత్తు, తలరాతల్ని నిర్ణయించే ఎన్నికలు అని, ఆలోచించి ఓటేయాలని కోరారు. చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్లిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. తాను ఇంటింటికీ మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా నిలబడి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నానని, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క మంచిపనైనా చేశారా? అని ప్రశ్నించారు. మంత్రివర్గంలో 68%, భర్తీచేసిన ప్రభుత్వ ఉద్యోగాల్లో 80%, ఆలయ కమిటీలు, నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ కాంట్రాక్టుల్లోనూ 50%, ప్రస్తుత ఎన్నికల్లో 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని ప్రపంచానికి చూపించామన్నారు. కాగా పొన్నూరులో సీఎం ప్రసంగం చప్పగా సాగింది. పొన్నూరు అభివృద్ధికి ఏం చేస్తామో చెప్పకపోవడంతో ప్రజల్లో ఉత్సాహం కనిపించలేదు. కొందరు ఆటోల్లోంచి దిగకుండా అక్కడే ఉండిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img