icon icon icon
icon icon icon

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం: నారా బ్రాహ్మణి

తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు.

Published : 30 Apr 2024 06:13 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని నులకపేటలో ‘స్త్రీశక్తి’ పథకం కింద కుట్టు శిక్షణ పొందిన మహిళలు, డ్వాక్రా సభ్యులతో సోమవారం సాయంత్రం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళాసాధికారతే లక్ష్యంగా తెదేపా పనిచేస్తోందని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ మహిళలను మహాశక్తిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారన్నారు. మంగళగిరిలో లోకేశ్‌ అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ పథకం ద్వారా 2,610 మంది కుట్టు శిక్షణ తీసుకుని ఉపాధి పొందుతున్నారని, దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళతామని వెల్లడించారు. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. లోకేశ్‌ మంగళగిరి ప్రజలను సొంత కుటుంబ సభ్యుల్లా భావించి సేవ చేస్తున్నారని తెలిపారు. ఆయన మాటల మనిషి కాదని చేతల మనిషి అని అన్నారు. ఆయన ప్రోత్సాహంతోనే పెళ్లయిన తర్వాత తాను అమెరికా వెళ్లి ఉన్నత విద్య అభ్యసించానని, ఇప్పుడు హెరిటేజ్‌ పరిశ్రమ నడుపుతున్నానని అన్నారు. మంగళగిరిని దేశంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పించారని, ప్రభుత్వ సహకారం లేకపోయినా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. స్త్రీశక్తి, నూతన వధూవరులకు పెళ్లికానుక, అన్న క్యాంటీన్‌, ఎన్టీఆర్‌ సంజీవని ఇలా పలు సేవలు అందిస్తున్నారన్నారు. చేనేత, స్వర్ణకారులు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేందుకు లోకేశ్‌ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైతే మరెన్నో కార్యక్రమాలను పెద్ద స్థాయిలో అమలు చేస్తారని తెలిపారు. తెదేపా సూపర్‌-6 పథకాలు మహిళలకు ఎంతో మేలు చేకూరుస్తాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img