icon icon icon
icon icon icon

వైకాపాను పోలవరం నీటిలో కలిపేయండి

దేశానికి తలమానికం, రాష్ట్రానికి జీవనాడి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును వైకాపా నాయకులు ఏటీఎంలా మార్చుకున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు.

Published : 01 May 2024 04:20 IST

ఆ ప్రాజెక్టు వైకాపాకు ఏటీఎం
కొయ్యలగూడెం సభలో పవన్‌ కల్యాణ్‌

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: దేశానికి తలమానికం, రాష్ట్రానికి జీవనాడి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును వైకాపా నాయకులు ఏటీఎంలా మార్చుకున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. నిర్వాసితులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా అయిపోయినా పట్టించుకోని జగన్‌.. ఇప్పుడు తండ్రి లేని బిడ్డనంటూ నాటకాలు ఆడేందుకు మీ ముందుకొస్తున్నారని ధ్వజమెత్తారు. నిర్వాసితులకు కనీస న్యాయం చేయలేకపోయిన వైకాపా సర్కారును పోలవరం నీటిలో కలిపేయాలని పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం కూడలిలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు. ‘పోలవరం ప్రాజెక్టు కింద లక్షా 60 వేల మందిని నిర్వాసితులుగా గుర్తిస్తే 7 వేల మందిని మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించి చేతులు దులిపేసుకున్నారు. మిగిలిన వారికి ఇల్లు, కనీస వసతులు కూడా లేకుండా పోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం’ అని చెప్పారు. ‘పక్కవారి ఆస్తిని దోచుకోవడం, దాచుకోవడం వైకాపా డీఎన్‌ఏలోనే ఉంది. పోలవరం నిర్వాసితులను ఆదుకోవడం ఇష్టం లేక వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టునే చంపేసింది. తెదేపా హయాంలో 70 శాతం పూర్తయిన పోలవరం జగన్‌ ప్రభుత్వం వచ్చాక కనీసం 5శాతం కూడా ముందుకు కదలలేదు. పోలవరం గురించి వైకాపా మంత్రులను అడిగితే హాస్యాస్పదంగా మాట్లాడతారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను అడిగితే వచ్చే ఏడాదంటారు. ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబును అడిగితే ఎప్పుడవుతుందో తెలియదంటూ చిందులేస్తారు’ అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు.

తలో 5 పైసలివ్వండి

‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను జగన్‌ ప్రభుత్వం దోచేసుకుంది. పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలంటే రూ.33 వేల కోట్లు కావాలి. అందుకోసం నా వంతు సాయంగా రూ.కోటి విరాళం ప్రకటిస్తున్నా. వారికి న్యాయం చేసేందుకు రాష్ట్రంలోని 5 కోట్ల మంది ముందుకొచ్చి తలా 5 పైసలిచ్చి, స్ఫూర్తి చాటాలి’ అని పిలుపునిచ్చారు. కొన్ని సామాజికవర్గాలపై కక్ష సాధింపు కోసం జగన్‌ రాజధానిని, చింతలపూడి ప్రాజెక్టులను నిలిపివేశారని.. ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా దానికి కులం అంటగడుతున్నారని ధ్వజమెత్తారు.


12 కీలకాంశాలతో ఉమ్మడి మ్యానిఫెస్టో

‘జనసేన షణ్ముఖ వ్యూహం, తెదేపా సూపర్‌ సిక్స్‌ కలిపి 12 అంశాలు కీలకంగా ఉమ్మడి మ్యానిఫెస్టో రూపొందించాం. విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి చోటు కల్పించాం. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమాతో ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం’ అని ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img