icon icon icon
icon icon icon

తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోకు మా పూర్తి సమ్మతి: భాజపా నేత సిద్ధార్థనాథ్‌సింగ్‌

రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కలసి ఎన్డీయేగా పోటీ చేస్తున్నప్పటికీ మంగళవారం విడుదల చేసిన మ్యానిఫెస్టోలో భాజపా ప్రత్యక్షంగా భాగస్వామి కాలేదు.

Updated : 01 May 2024 08:17 IST

మా పార్టీ సంప్రదాయం మేరకే భాగస్వాములం కాలేదని వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కలసి ఎన్డీయేగా పోటీ చేస్తున్నప్పటికీ మంగళవారం విడుదల చేసిన మ్యానిఫెస్టోలో భాజపా ప్రత్యక్షంగా భాగస్వామి కాలేదు. భాజపా సలహాల్ని, సూచనల్ని పొందుపరుస్తూ, తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోగా మాత్రమే దాన్ని విడుదల చేశారు. ‘ప్రజాగళం’ పేరుతో విడుదల చేసిన మ్యానిఫెస్టోపై తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల ఫొటోలు మాత్రమే ముద్రించారు. చంద్రబాబు నివాసంలో జరిగిన మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమానికి భాజపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌సింగ్‌ హాజరయ్యారు. మ్యానిఫెస్టోని విడుదల చేసేటప్పుడు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మాత్రమే దాని ప్రతుల్ని పట్టుకున్నారు. ఎన్డీయే తన మ్యానిఫెస్టోను జాతీయ స్థాయిలో ప్రకటించిందని, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలసి పోటీ చేస్తున్న చోట... అక్కడ మ్యానిఫెస్టోల్లో భాజపా భాగస్వామి కావడం లేదని సిద్ధార్థనాథ్‌సింగ్‌ స్పష్టతనిచ్చారు. అదే సంప్రదాయాన్ని పాటిస్తూ ఇక్కడ తెదేపా-జనసేన మాత్రమే సంయుక్తంగా మ్యానిఫెస్టోను విడుదల చేశాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి భాజపా తరఫున తాను స్వయంగా హాజరయ్యానంటేనే... మ్యానిఫెస్టోకు తమ పార్టీ పూర్తి సమ్మతి ఉందని అర్థమని ఆయన వివరించారు. ఉమ్మడిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని, మిగతా రాష్ట్రాల కంటే ఏపీ నుంచి ఎన్డీయే అత్యధిక స్థానాలు గెలుస్తుందని తెలిపారు. మ్యానిఫెస్టోలో పేర్కొన్న ‘కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్‌ నిర్మాణానికి చర్యలు’ వంటి కొన్ని అంశాల్ని భాజపా సూచన మేరకే పొందుపరిచినట్టు పార్టీ వర్గాల సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img