icon icon icon
icon icon icon

‘రెండు ‘బీ’ల చేతుల్లో జగన్‌ రిమోట్‌’

‘కాంగ్రెస్‌ పార్టీని చంద్రబాబు రిమోట్‌ కంట్రోల్‌తో పని చేయిస్తున్నారని జగన్‌మోహన్‌రెడ్డి ఒక ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు.

Updated : 01 May 2024 07:45 IST

సీఎంకు రిమోట్‌ కంట్రోళ్లపై బాగా అవగాహన ఉంది
ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి బిడ్డ ఓడిపోయిందంటే.. నేరం గెలిచిందని అర్థం
పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: ‘కాంగ్రెస్‌ పార్టీని చంద్రబాబు రిమోట్‌ కంట్రోల్‌తో పని చేయిస్తున్నారని జగన్‌మోహన్‌రెడ్డి ఒక ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. కానీ వాస్తవానికి రిమోట్‌కంట్రోళ్ల గురించి జగన్‌మోహన్‌రెడ్డికే బాగా అవగాహన ఉంది. ఎందుకంటే గత ఐదేళ్లుగా ఆయనే కేంద్రంలోని భాజపా చేతిలో రిమోట్‌ కంట్రోల్‌గా పనిచేస్తున్నారు. రెండోది- తన ఇంట్లో ఉన్నవారి చేతిలో రిమోట్‌ కంట్రోల్‌గా పనిచేస్తున్నారు. ఆ రెండు రిమోట్‌లూ ‘బీ’తోనే మొదలవుతాయి’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ చేసిన ఆరోపణలపై స్పందించారు.
అవినాష్‌రెడ్డిని పోటీ నుంచి తప్పించండి: ‘జగన్‌ అన్నను సూటిగా అడుగుతున్నా. చెల్లెలు ఓడిపోతుందన్న బాధ ఉంటే అవినాష్‌రెడ్డిని ఎందుకు పోటీ నుంచి తప్పించడం లేదు? ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. మీ బాధ నిజమైతే పోటీ నుంచి ఉపసంహరించుకోమనండి. ఎన్నికల్లో వివేకా ఓడిపోయినప్పుడు మీరెంత బాధపడ్డారు? ఆ ఎన్నికల్లో వివేకాను ఓడించింది అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డే కదా? అలాంటి వారికి మీరు మళ్లీ టికెట్‌ ఇచ్చారు. నేను ఓడిపోతాననే నమ్మకం మీకు ఉంటే ఎందుకు భయపడుతున్నారు. వైఎస్‌ కుటుంబ సభ్యులందరితో ఎందుకు ప్రచారం చేయిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటమి భయంతోనే దుష్ప్రచారం

‘జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే తన చెల్లి అని చూడకుండా.. నా గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. చిన్నాన్న హత్య కేసులో ప్రధాన నిందితుడు అవినాష్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చినందునే.. నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఇతరులకు టికెట్‌ ఇచ్చి ఉంటే నేను పోటీ చేయకుండా ఉండేదాన్ని. వైఎస్సార్‌ మరణంలో రిలయన్స్‌ హస్తం ఉందని చర్చ జరిగినా.. అంబానీ చెప్పిన వాళ్లకి ఎంపీ పదవి ఇచ్చారు’ అని షర్మిల పేర్కొన్నారు.  ‘కేసుల నుంచి బయటపడటానికి జగన్‌ దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారు. సీబీఐ ఛార్జిషీట్‌లో రాజశేఖరరెడ్డి పేరును జగనే చేర్పించారు. పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌కు సంబంధం లేదు. కడప ఎన్నికలు న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్నాయి. ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి బిడ్డ ఓడిపోయిందంటే.. నేరం గెలిచినట్లే’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

మట్టి చెంబు ఇచ్చి.. వెండి చెంబు లాక్కున్నారు

అంబాజీపేట, పి.గన్నవరం, న్యూస్‌టుడే: ‘వైకాపా పాలనలో ఎనిమిదిసార్లు ఆర్టీసీ, ఐదుసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారు. సంక్షేమం పేరిట ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి, మరో చేత్తో వెండి చెంబు లాక్కున్నారు’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. వైకాపా అధికారంలోకి వస్తే రైతుల కోసం ఏటా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్‌.. ఆ తర్వాత చేతులెత్తేశారని విమర్శించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేటలో మంగళవారం నిర్వహించిన రోడ్‌ షోలో ఆమె మాట్లాడారు. ‘అందరికి ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తే.. ఈ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పేరుతో వాటికి కత్తిరింపులు చేశారు’ అని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలి’ అని షర్మిల కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img