icon icon icon
icon icon icon

తమ్ముడు అవినాష్‌ చాలా సౌమ్యుడు!

ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి చాలా సౌమ్యుడని, అలాంటివారు చాలా తక్కువ మందే కనిపిస్తారని సీఎం జగన్‌ ప్రశంసల వర్షం కురిపించారు.

Published : 01 May 2024 06:14 IST

మైదుకూరు సభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రశంసలు
రాజోలి ప్రాజెక్టు కట్టలేకపోయా, ఏమీ అనుకోవద్దు
నాది ప్రోగ్రెస్‌ రిపోర్టు.. చంద్రబాబుది బోగస్‌ రిపోర్టు
టంగుటూరు ఎన్నికల ప్రచార సభలో సీఎం

ఈనాడు, కడప: ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి చాలా సౌమ్యుడని, అలాంటివారు చాలా తక్కువ మందే కనిపిస్తారని సీఎం జగన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు, అన్నమయ్య జిల్లా కలికిరిలో మంగళవారం నిర్వహించిన సభల్లో జగన్‌ ప్రసంగిస్తూ ఎంపీ అవినాష్‌రెడ్డిని మరోసారి వెనకేసుకొచ్చారు. మన ప్రభుత్వం వచ్చాక మైదుకూరు ప్రాంతంలో రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, కొన్ని ఇబ్బందుల వల్ల కట్టలేకపోయానని, ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఏమీ అనుకోవద్దని, వచ్చేసారి కట్టేస్తానని నమ్మించే ప్రయత్నం చేశారు.

మ్యానిఫెస్టోలో మోదీ ఫొటో వద్దన్న భాజపా

‘2014 మ్యానిఫెస్టోలో మోదీ, దత్తపుత్రుడి ఫొటోలు కూడా జోడించి సంతకం పెట్టి ఇంటింటికీ పంచారు. వాటిని అమలు చేయలేదు. అందుకే కొత్తగా విడుదల చేసిన మ్యానిఫెస్టోపై మోదీ ఫొటో పెట్టవద్దని పైనుంచి భాజపా నేతలు ఫోన్‌ చేశారు. ఫొటో పెడితే తాము ఒప్పుకోమని తేల్చిచెప్పారు. సాధ్యం కాని హామీల్లో తమ ఫొటో వద్దంటూ భాజపా తప్పుకొందంటేనే చంద్రబాబు విశ్వసనీయతను అర్థం చేసుకోవచ్చు’ అని జగన్‌ విమర్శించారు. మైదుకూరు సభకు ఓ మోస్తరుగా జనంరాగా, కలికిరిలో జనం మొహం చాటేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి పెద్ద కసరత్తే చేసి భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీలేరు తెదేపా అభ్యర్థి కిషోర్‌కుమార్‌రెడ్డి స్వస్థలంలో సభ నిర్వహించగా జనం రాలేదు. మైదుకూరు సభలో ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న రఘురామిరెడ్డి పాల్గొన్నారు. కలికిరిలో మంత్రి పెద్దిరెడ్డితో పాటు రాజంపేట ఎంపీ, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థులు మిథున్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.


మనసున్న నాయకుడికే ఓటేయండి

ఈనాడు, ఒంగోలు- టంగుటూరు, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకోవడం కోసమే కాదు. పేదవాడి తలరాతను, భవిష్యత్తును మార్చబోయే ఎన్నికలు. మోసాలు, వంచనలు చేయని, మనసున్న నాయకుడికే ఓటేయండి’ అని ప్రజలను సీఎం జగన్‌ కోరారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. మీ బిడ్డ జగన్‌ది ప్రోగ్రెస్‌ రిపోర్టు అయితే, చంద్రబాబుది బోగస్‌ రిపోర్టు అని ఎద్దేవా చేశారు. అయితే అన్నీ పాత విషయాలు, అబద్ధాలు పదేపదే చెబుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసినా సభికుల నుంచి స్పందన కరవైంది.

మండుటెండలో జనాన్ని మాడ్చి...

జగన్‌ గంటన్నర ఆలస్యంగా టంగుటూరుకు చేరుకున్నారు. అప్పటికే పలువురు సభా ప్రదేశం నుంచి వెళ్లిపోయారు. సీఎం హెలిప్యాడ్‌ వద్దకు వచ్చే సమయానికి సభాస్థలిలో 500 మంది కూడా లేరు. దీంతో వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ జనాన్ని రావాలని కోరారు. డ్రోన్‌ విజువల్స్‌లో జనం ఎక్కువగా కనిపించేలా సీఎం బస్సు చుట్టూ ఎక్కువమందిని ఒకేచోట రోప్‌ పార్టీ పోలీసులు నిలిపి ఉంచారు. దీంతో వృద్ధులు, మహిళలు ఇబ్బంది పడ్డారు. టంగుటూరు నుంచి సింగరాయకొండ, కొండపి, ఒంగోలు వెళ్లే మూడు మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటుచేసి పట్టణంలోకి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో సాధారణ ప్రజలు, ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు.

వైకాపా కార్యకర్తల కార్లలో గోవా మద్యం

వైకాపా కార్యకర్తల కార్లలో తరలిస్తున్న గోవా మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం టంగుటూరులో సీఎం సభకు మర్రిపూడి మండలానికి చెందిన నలుగురు వైకాపా కార్యకర్తలు కార్లలో వచ్చారు. సభ ముగిశాక తిరిగి వెళ్తుండగా అసిస్టెంట్‌ జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. నాలుగు కార్లలో 60 గోవా మద్యం సీసాలు లభించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img