icon icon icon
icon icon icon

జగన్‌.. ఓ బ్యాండేజ్‌ బబ్లూ

‘యువత భవితను బ్యాండేజ్‌ బబ్లూ జగన్‌ నాశనం చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను ఓడించి సాగనంపాలి. మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాం.

Updated : 01 May 2024 07:09 IST

వంద రోజుల్లో పరిశ్రమలు స్థాపిస్తాం
ఒకే ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ
యువగళం సభలో యువతకు లోకేశ్‌ భరోసా

ఈనాడు, ఒంగోలు: ‘యువత భవితను బ్యాండేజ్‌ బబ్లూ జగన్‌ నాశనం చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను ఓడించి సాగనంపాలి. మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాం. తొలి సంతకం మెగా డీఎస్సీపై చేయడంతోపాటు ఒకే నోటిఫికేషన్‌తో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి, యువగళం సారథి నారా లోకేశ్‌ భరోసానిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో యువగళం ఎన్నికల సమరభేరి పేరుతో విద్యార్థులు, యువతతో ఆయన మంగళవారం సంభాషించారు. యువత అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతిలో ఆగిపోయిన పనులన్నీ ప్రారంభిస్తాం. విశాఖను ఐటీ, ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌ చేస్తాం. జిల్లాకు ఒక రంగాన్ని ఎంచుకుని అభివృద్ధి చేసి సొంత జిల్లాల్లోనే యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. డిగ్రీలు, పీజీ చదివి ఉద్యోగాల కోసం మళ్లీ నాలుగైదు కోర్సులు చేసే పరిస్థితి లేకుండా విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తాం. అయిదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలుచేస్తాం. జగన్‌ పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడినపెట్టే బాధ్యత తీసుకుంటాం’ అని ఆయన భరోసానిచ్చారు. జగన్‌లా పరదాల మాటున తిరిగేవాళ్లం కాదని, రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను చంద్రబాబునాయుడు అనే బ్రాండ్‌తో తిరిగి తెచ్చి ఉపాధి కల్పిస్తామని అన్నారు. తెదేపా పాలనలో పరిశ్రమలు విరివిగా రాష్ట్రానికి వచ్చాయని, రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెప్పించామని లోకేశ్‌ గుర్తుచేశారు.

తెదేపాది మానవత్వం.. వైకాపాది రాక్షససత్వం

‘రాజకీయం వేరు, వ్యక్తిగత జీవితం వేరుగా చూసే సంప్రదాయం, మానవత్వం తెదేపాకు ఉన్నాయి. వైకాపాది మాత్రం రాక్షససత్వం. ప్రజల పక్షాన పోరాడితే వారిపై కేసులు, దాడులు, బెదిరింపులకు పాల్పడి అరాచకంగా వ్యవహరించింది. నాపై 23 కేసులు పెట్టించింది’ అని లోకేశ్‌ అన్నారు. తప్పుచేసిన అధికారుల పేర్లు రెడ్‌బుక్‌లో రాసుకున్నానని, వారిపై న్యాయపరంగా పోరాడి శిక్షిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఒంగోలు కార్పొరేటర్లు నాగభూషణం, నరసయ్య, ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్‌ ఛైర్మన్‌ సుబ్బారావుగుప్తా తెదేపాలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img