icon icon icon
icon icon icon

హామీలు అమలు చేయకపోగా.. రూ.8 లక్షల కోట్ల అవినీతి

వైకాపా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం జగన్‌... రూ.8 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రకటించిన తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోకు కేంద్రప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉందని స్పష్టం చేశారు.

Published : 03 May 2024 05:36 IST

తెదేపా, జనసేన మ్యానిఫెస్టోకు భాజపా సంపూర్ణ సహకారం
బాబు ష్యూరిటీకి.. మోదీ గ్యారెంటీ తోడు: ఎన్డీయే నేతలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం జగన్‌... రూ.8 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రకటించిన తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోకు కేంద్రప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉందని స్పష్టం చేశారు. ప్రజాగళంలో తెదేపా అధినేత చంద్రబాబు, జనవాణిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, యువగళంలో తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దృష్టికి వచ్చిన అంశాలే కాక, వివిధ మార్గాల్లో వచ్చిన లక్షకు పైగా వినతుల్ని క్రోడీకరించి ఉమ్మడి మ్యానిఫెస్టోను రూపొందించినట్టు వెల్లడించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌, భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, జనసేన రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌ విలేకర్లతో గురువారం మాట్లాడారు. ‘‘ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు చెల్లించాల్సిన సుమారు రూ.2వేల కోట్ల బకాయిల్ని ఈ ప్రభుత్వం పెండింగ్‌ పెట్టింది. దీంతో ఆయా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయబోమని బోర్డులు పెట్టాయి. జగన్‌ పాలనలో అధ్వానంగా మారిన వైద్యఆరోగ్య రంగాన్ని పునరుద్ధరించడం ఎన్డీయే ప్రభుత్వంతోనే సాధ్యం’’ అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తెలిపారు.

మూడు పార్టీల కలయిక మహాశక్తి

‘‘పలు కేంద్ర పథకాలతో ఏపీకి మేలు జరుగుతుంది. శ్మశానాల్లో ఉన్న శిలాఫలకాల మీద కూడా తన బొమ్మలు వేసుకోవడానికి జగన్‌ సిద్ధమయ్యారు. అలాంటి వ్యక్తి తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోపై ఉన్న బొమ్మల గురించి మాట్లాడుతున్నారు’’ అని లంకా దినకర్‌ మండిపడ్డారు. ఉమ్మడి మ్యానిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇచ్చారని జనసేన ప్రధానకార్యదర్శి శివశంకర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img