icon icon icon
icon icon icon

మహిళల్ని కించపరిచే వైకాపా పోస్టులపై సీఈఓ ఆగ్రహం

తెలుగు మహిళా నేతల్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో వైకాపా శ్రేణులు పెడుతున్న అసభ్యకర పోస్టులు, అభ్యంతరకర సమాచార వ్యాప్తిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 05 May 2024 06:35 IST

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి నోటీసులు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెలుగు మహిళా నేతల్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో వైకాపా శ్రేణులు పెడుతున్న అసభ్యకర పోస్టులు, అభ్యంతరకర సమాచార వ్యాప్తిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఇలాంటి చర్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై తెదేపా నేతలు ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా, చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. తక్షణం సంబంధిత పోలీసు అధికారుల నుంచి వివరణ తెప్పించుకొని, బాధ్యులపై ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాథరెడ్డిని ఆదేశించారు. తమపై సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న వికృత ప్రచారంపై తెలుగు మహిళా నేతలు పరుచూరి రమ్య, ఉండవల్లి అనూష, సందిరెడ్డి గాయత్రిలు.. మార్ఫింగ్‌ చేసిన వారి ఫొటోల్ని దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఎక్స్‌లో పోస్టు చేయడంపై తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వేర్వేరుగా చేసిన ఫిర్యాదులపై సీఈఓ స్పందించారు. ‘తెదేపా వారిమనే కారణంతో మా ఫొటోల్ని అర్ధనగ్న చిత్రాలకు జతచేసి వైకాపా వాళ్లు మార్ఫింగ్‌ చేస్తున్నారు. చివరికి సీఈఓకు ఫిర్యాదు చేసిన ఫొటోనూ మార్ఫింగ్‌ చేశారు. దీనిపై ఆయా అనేకసార్లు ఫిర్యాదు చేసినా.. పోలీసులు చర్యలు తీసుకోలేదు’ అని ఫిర్యాదులో తెలుగు మహిళా నేతలు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img