icon icon icon
icon icon icon

ప్రజల ఆస్తి పత్రాలను అమెరికా కంపెనీ చేతుల్లో ఎలా పెడతారు?

రాష్ట్ర ప్రజల ఒరిజినల్‌ ఆస్తి పత్రాలను డిజిటల్‌ రూపంలో క్రిటికల్‌ రివర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే అమెరికా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ చేతుల్లో ఎలా పెడతారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు.

Published : 05 May 2024 06:35 IST

ఏ ప్రాతిపదికన ‘క్రిటికల్‌ రివర్‌’ కంపెనీని ఎంపిక చేశారు?
తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర ప్రజల ఒరిజినల్‌ ఆస్తి పత్రాలను డిజిటల్‌ రూపంలో క్రిటికల్‌ రివర్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే అమెరికా సాఫ్ట్‌వేర్‌ కంపెనీ చేతుల్లో ఎలా పెడతారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు. ప్రజల ఆస్తికి సంబంధించిన కీలకమైన డిజిటల్‌ పత్రాల్ని భద్రపరచడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్‌ ఇన్‌ఫర్‌మేటిక్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) సర్వర్‌ను కాదని... ప్రైవేటు కంపెనీకి ఎలా అప్పగిస్తారని నిలదీశారు. అసలు ఈ అధికారం మీకెవరిచ్చారని వైకాపా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మిగతా రాష్ట్రాల్ని కాదని ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం అమలు చేయమని ఒక్క ఏపీపైనే నీతి ఆయోగ్‌ ఒత్తిడి చేస్తోందా అని మండిపడ్డారు. కేంద్రం ఒత్తిడితోనే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామంటున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు... భాజపా పాలిత రాష్ట్రాలు అమలు చేయడం లేదని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

టెండర్‌ ఎప్పుడు పిలిచారు?

‘‘రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం ప్రకారం ఇక మీదట రిజిస్టర్‌ ఆఫీసుల్లో జరిగే భూ లావాదేవీలు, ఆస్తుల క్రయవిక్రయాల అసలు పత్రాల్ని డిజిటలైజ్‌ చేసి కేవలం ‘ఈ-స్టాంపు’ పేపర్‌ను మాత్రమే యజమానికి ఇస్తారు. ఒరిజినల్‌ పత్రాల్ని అమెరికాకు చెందిన కంపెనీ సర్వర్‌లో భద్రపరుస్తారు. అసలు ఈ కంపెనీని ఎలా ఎంపిక చేశారు? టెండర్‌ ఏమైనా పిలిచారా? పిలిస్తే ఎప్పుడు? ఎంత మంది దరఖాస్తు చేశారు? క్రిటికల్‌ రివర్‌ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఫీజు ఎంత? కంపెనీ ట్రాక్‌ రికార్డు ఏంటి?’’ అని నీలాయపాలెం విజయ్‌కుమార్‌ ప్రశ్నించారు.

కేంద్రం కంటే ముందే చట్టం చేశారు

‘‘నీతి ఆయోగ్‌ 2019 నవంబరులో ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రూపొందించడం మొదలుపెడితే... దానికి ముందే ఏపీ ప్రభుత్వం చట్టాన్ని రూపొందించి అనుమతుల కోసం కేంద్రానికి పంపింది. కేంద్ర రెండు, మూడు సార్లు తిప్పి పంపాక చివరికి 2023లో రాష్ట్రం చట్టం చేసింది. దేశంలో ఒక్క ఏపీనే ఈ చట్టాన్ని అమలు చేస్తోంది’’ అని విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

చట్టం అమల్లో లేకపోతే జీవోలెందుకిచ్చారు?

‘‘సర్వే పూర్తయితేనే చట్టం అమలు చేస్తామని ధర్మాన ప్రసాదరావు చెబుతున్నారు. అలాంటప్పుడు స్టేట్‌ ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? ఇంకా 13 వేల గ్రామాలు, పట్టణాల్లో సర్వే పూర్తి కావాల్సి ఉండగా.. ఎంపిక చేసిన రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో మే నుంచి ఈ చట్టం ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేయాలని ఎలా ఆదేశించారు?’’ అని ధర్మానను ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img