icon icon icon
icon icon icon

మద్య నిషేధం చేయకుండా ఓట్లెలా అడుగుతారు?

దశల వారీగా మద్య నిషేధం చేశాకే ఓట్లడుగుతామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన జగన్‌.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అభ్యర్థిస్తున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

Published : 05 May 2024 06:35 IST

‘నవ సందేహాలు’ పేరుతో జగన్‌కు షర్మిల మరో లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దశల వారీగా మద్య నిషేధం చేశాకే ఓట్లడుగుతామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన జగన్‌.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అభ్యర్థిస్తున్నారని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. మద్యం విక్రయాలపై ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు 9 ప్రశ్నలు సంధిస్తూ శనివారం మరో లేఖ రాశారు. సీఎంకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


షర్మిల సంధించిన ప్రశ్నలు

1. మీరు ప్రకటించినట్లుగా రాష్ట్రంలో మద్య నిషేధం పాక్షికంగానైనా అమలవుతోందా? అయితే ఏ దశలో ఉంది? అందులో ఉన్న షరతులేమిటి?

2. ‘మూడు దశల్లో మద్య నిషేధం అమలు చేసి, అయిదు నక్షత్రాల హోటళ్లలోనే మద్యం అందుబాటులో ఉండేలా కట్టడి చేసి.. అప్పుడే ఓట్లడగడానికి వస్తా’ అని మీరన్న మాట మీద నిలబడతారా?

3. మద్యం అమ్మకాలు క్రమంగా తగ్గిస్తామన్నారు. 2019-20లో విక్రయాలు రూ.20 వేల కోట్లు ఉండగా 2023-24 నాటికి రూ.30 వేల కోట్లకు పెరగడం వాస్తవం కాదా?

4. ‘మద్యం ద్వారా ఆదాయం అంటే ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం’ అంటూ గత ఎన్నికల్లో చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం తయారీ, సరఫరా, అమ్మకం.. అంతా మీ పార్టీ వాళ్లదే కాబట్టి ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారని అంగీకరిస్తారా?

5. ప్రముఖ బ్రాండ్లను తరిమేసి, డిస్టిలరీలను చెరబట్టి.. గతంలో ఎన్నడూ లేని బ్రాండ్లతో నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం దుర్మార్గం కాదా?

6. చేయూత, ఆసరా, అమ్మఒడి వంటి సంక్షేమ పథకాల బాధ్యతను బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు అప్పగించడాన్ని ఎలా సమర్థించుకుంటారు?

7. కేంద్ర ప్రభుత్వం వద్దంటున్నా వినకుండా ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ.. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.11 వేల కోట్ల రుణం సేకరించాలని ప్రయత్నించి భంగపడిపోయింది నిజం కాదా?

8. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ), నార్కోటిక్‌ సెంట్రల్‌ బ్యూరో నివేదికల ప్రకారం.. దేశంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు పట్టుబడుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 2020లో రెండో స్థానంలో, 2019, 2021లో మొదటి స్థానంలో నిలిచింది వాస్తవం కాదా?

9. మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారు రాష్ట్రంలో 20.19 లక్షల మంది ఉన్నట్లు.. కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వశాఖ స్థాయీ సంఘం పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది నిజం కాదా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img