icon icon icon
icon icon icon

‘న్యూస్‌టుడే’ విలేకరిపై వైకాపా మూకల దాడి

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన్‌ ప్రచార సభ కవరేజీకి వెళ్లిన కళ్యాణదుర్గం గ్రామీణం ‘న్యూస్‌టుడే’ విలేకరి కె.రమేష్‌పై వైకాపా మూకలు దాడి చేశాయి.

Published : 10 May 2024 06:49 IST

మా పార్టీ సభకు ఎందుకొచ్చావంటూ పిడిగుద్దులు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం - న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన్‌ ప్రచార సభ కవరేజీకి వెళ్లిన కళ్యాణదుర్గం గ్రామీణం ‘న్యూస్‌టుడే’ విలేకరి కె.రమేష్‌పై వైకాపా మూకలు దాడి చేశాయి. విచక్షణారహితంగా పిడిగుద్దులు గుప్పించడంతో రమేష్‌ గాయపడ్డారు. గురువారం కళ్యాణదుర్గంలో జరిగిన వైకాపా ప్రచార సభలో మద్యం తాగిన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పోలీసులపై సైతం దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇదే క్రమంలో ప్రచార సభ కవరేజీకి వెళ్లిన రమేష్‌ను వాల్మీకి సర్కిల్‌లో అడ్డగించి దాడికి తెగబడ్డారు. తప్పించుకోవడానికి ప్రయత్నించినా పట్టుకుని మరీ కొట్టారు. తమ పార్టీ ప్రచార సభకు ఎందుకొచ్చావంటూ నేలపై పడేసి కాళ్లతో విచక్షణారహితంగా తన్నడంతో రమేష్‌ భుజంతోపాటు ఛాతికి గాయాలయ్యాయి. వైకాపా మూకలను స్థానికులు అడ్డుకోవడంతో రమేష్‌ ఫోన్‌, పర్సును లాక్కుని పరారయ్యారు. గాయపడిన రమేష్‌ను తొలుత కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి, తరువాత అనంతపురంలోని పావని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు వైకాపా మూకల దాడిపై రమేష్‌ కళ్యాణదుర్గం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

రమేష్‌ను పరామర్శించిన అమిలినేని

గాయపడిన రమేష్‌ను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పరామర్శించారు. జగన్‌ సభలు ఎక్కడ జరిగినా జర్నలిస్టులపై దాడి చేయడం పరిపాటయిందని ఆయన విమర్శించారు. ఓటమి భయంతో వైకాపా నాయకుల్లో అసహనం పెరిగిందని పేర్కొన్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దాడిని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, తెదేపా రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ బీవీ వెంకట్రాముడు తదితరులు తీవ్రంగా ఖండించారు.

సీఎంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి  ప్రజలు, మీడియాపై యథేచ్చగా దాడులు జరుగుతున్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ‘పోలింగ్‌ ముగియగానే జగన్‌ లండన్‌ పారిపోతారు. ఆయన అండ చూసుకొని రెచ్చిపోతున్న వైకాపా గూండాల పరిస్థితేంటో ఆలోచించుకోండి’ అని హెచ్చరించారు. రమేష్‌పై దాడిని ఖండించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img