Sahayata Wheelchair: స్మార్ట్ వీల్‌ఛైర్‌తో రూ.కోటి ఫండింగ్.. తమిళనాడు యువతి సత్తా
బ్యాటరీతో పని చేసే ఓ వీల్ ఛైర్‌ను శ్రుతి బాబు అనే మహిళ రూపొందించారు. వయో వృద్ధులు, వికలాంగులకు ఈ ‘సహాయత ఛైర్’ (Sahayata Wheelchair) బాగా ఉపయోగపడుతుంది అని తెలిపారు.
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన 27 ఏళ్ల శ్రుతి బాబు తన వినూత్న ఆవిష్కరణతో సత్తా చాటింది. వయోవృద్ధులు, వికలాంగులు, అనారోగ్యం కారణంగా నడవలేని వారికి, మరుగుదొడ్డికి వెళ్లలేక ఇబ్బంది పడేవారికి అన్ని విధాలుగా సహాయపడేలా ‘సహాయత’ పేరుతో స్మార్ట్ వీల్‌ఛైర్ (Sahayata Wheelchair)ను రూపొందించి రూ.కోటి ఫండింగ్ గెల్చుకుంది. ఉత్తమ అంకుర సంస్థల ఆలోచనలకు నిధులు అందించి అండగా నిలిచే ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ (Sharktank India) కార్యక్రమంలో తన ఆవిష్కరణను ప్రదర్శించి మెప్పించింది.
బయో మెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ చదివిన శ్రుతి 2018లో మెడికల్ కోడర్‌గా పనిచేసేది. ఓ సామాజిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఫెలోషిప్ చేసే అవకాశం ఆమెకు వచ్చింది. అందులో భాగంగా ఓసారి కోయంబత్తూరులోని ఓ ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడ కనిపించిన ఓ దృశ్యం ఆమెను వెంటాడింది. పక్షవాతం బారిన పడిన ఓ వ్యక్తి స్ట్రెచర్‌పైనే మల విసర్జన చేశాడు. ఆ సమయంలో అతడికి తోడుగా తన ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు. తనను శుభ్రం చేసుకోవడానికి వీలు కాక అతడు సహాయం కోసం కుమార్తెల వైపు చూశాడు. అప్పుడు ఆ అమ్మాయిల ఇబ్బందికర పరిస్థితి, అది చూసి వారి తండ్రి ముఖంలో అవమాన భారం, ఈ పరిస్థితి రావడం కన్నా చావడం మేలంటూ అతడు కన్నీళ్లు పెట్టుకోవడం శ్రుతి గమనించింది.
నడవడానికి వీలుకాని ఎంతోమంది నిత్యం ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను, అవమానాలను ఎదుర్కొంటూ జీవిస్తున్న విషయం ఆమెను ఆలోచింపజేసింది. వారు గౌరవంగా జీవించగలిగేలా ఏం చేయొచ్చని అన్వేషించింది. అదే స్మార్ట్ వీల్‌ఛైర్ ఆవిష్కరణకు నాంది పలికింది. సులువుగా వినియోగించగలిగే, సౌకర్యవంతమైన చక్రాల కుర్చీని రూపొందించడానికి ఎంతో పరిశోధన చేసింది. మెకానికల్ ఇంజినీర్ అయిన తన తండ్రి కె.కె.బాబు సహాయం కూడా తీసుకుంది. చివరకు 118 నమూనాల తర్వాత తాను అనుకున్న స్మార్ట్ వీల్‌ఛైర్‌కు రూపం ఇచ్చింది. ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లడానికే కాదు, అవసరమైతే స్టెచర్‌లా, మలమూత్ర విసర్జనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యంత్రం సహాయంతో శుభ్రమయ్యే టాయిలెట్ సౌకర్యమున్న ఈ వీల్‌ఛైర్‌కు ‘సహాయత’ అని శ్రుతి పేరు పెట్టింది.
ఎలా పనిచేస్తుంది?
ఈ వీల్‌ఛైర్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. బటన్ నొక్కితే సీటు మధ్య భాగం పక్కకు జరిగి కమోడ్‌లా మారుతుంది. కింద భాగంలో అమర్చిన ఓ కప్పు లాంటి పాత్రలోకి మానవ వ్యర్థాలు వెళ్లే ఏర్పాటు ఉంది. ఆ పాత్రను కూర్చున్నవారికి ఇబ్బంది కలగకుండానే చక్రాల కుర్చీ వెనుక నుంచి బయటకు తీయొచ్చు. అనంతరం మనిషి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్‌గా శుభ్రం చేయడానికి వీలుగా ఓ నీటి నిల్వ పాత్రను, యంత్రాన్ని అనుసంధానం చేశారు. ఇందుకోసం ‘బైడెట్’ అనే జపనీస్ విధానాన్ని పాటించారు. ఈ చక్రాల కుర్చీ వల్ల మరుగుదొడ్డి వరకూ వెళ్లాల్సిన ఇబ్బంది, సహాయకుల అవసరం తప్పుతుంది. దీంతోపాటు స్ట్రెచర్‌లా మారే సదుపాయం ఉండటం వల్ల రోగులు దీనిపై నుంచి బెడ్ మీదకు సులువుగా మారొచ్చని శ్రుతి చెబుతోంది. ఈ వీల్‌ఛైర్‌కున్న బ్యాటరీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు నెల రోజులు పనిచేస్తుందని చెప్పింది.
షార్క్ ట్యాంక్‌లో అనూహ్య స్పందన
ఓ ఛానల్‌లో ప్రసారమైన ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ రెండో సీజన్‌లో ఆమె ఇటీవల తన ‘సహాయత’ స్మార్ట్ వీల్‌ఛైర్‌ను ప్రదర్శించింది. న్యాయనిర్ణేతలైన వ్యాపారవేత్తలు అమిత్ జైన్, అమన్ గుప్తా, అనుపమ్ మిత్తల్ తదితరులు ఆ ఆవిష్కరణ చూసి ఆశ్చర్యపోయారు. శ్రుతి ఆలోచన నచ్చి వీల్ ఛైర్‌లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు 10 శాతం ఈక్విటీలో రూ.కోటి పెట్టుబడి పెట్టడానికి అంగీకరించారు. శ్రుతి తన సొంత వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో ఆ వీల్‌ఛైర్‌లను విక్రయిస్తోంది. స్ట్రెచర్ సౌకర్యమున్న వీల్ ఛైర్‌ను రూ.39,900కు వినియోగదారులకు అందిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్