Japan : రోజుకో భూకంపం.. చెక్కు చెదరని జపాన్‌ సంకల్పం!

ఇటీవల తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంపంలో దాదాపు 50వేల మంది మరణించారు. మరి రోజూ భూకంపాలు వస్తున్నా జపాన్‌లో అంత మంది భద్రంగా ఎలా జీవనం సాగిస్తున్నారో చదివేయండి.

Published : 10 Mar 2023 17:30 IST

స్వల్ప, అధిక మోతాదులో జపాన్‌(Japan)ను ఏటా దాదాపు 5వేల భూకంపాలు(Earthquake) పలకరిస్తుంటాయి. కొన్ని శతాబ్దాలుగా ఆ విపత్తులను కళ్లారా చూస్తున్న అక్కడి ప్రజలు వాటిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. దాంతో భూకంపం సంభవించినప్పుడు ఇతర దేశాల్లో జరిగే నష్టంతో పోలిస్తే జపాన్‌లో మరణాల రేటు, ఆస్తి నష్టం తక్కువగా నమోదవుతోంది. అసలు భూకంప సమాచారం జపాన్‌ పౌరులు ఎలా తెలుసుకుంటారు. ఏ విధంగా ఎదుర్కొంటారో తెలుసుకుందామా..

జపాన్‌లోనే ఎందుకు?

భౌగోళిక పరిస్థితుల కారణంగా జపాన్‌లో ఎక్కువ భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్‌ పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో ఉంటుంది. 40వేల కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో 450 అగ్నిపర్వతాలున్నాయి. అందులో మెజారిటీ అగ్నిపర్వతాలు జపాన్‌లోనే కనిపిస్తాయి. అవి నిరంతరం క్రియాశీలకంగా ఉంటాయి. జపాన్‌ 4 కాంటినెంటల్‌ ప్లేట్స్‌ చర్యలతో సంబంధం కలిగి ఉంది. ద పసిఫిక్‌, ద ఫిలిప్పీన్‌, ద యురేసియన్‌, ద నార్త్‌ అమెరికా ప్లేట్‌లు తరచూ కదులుతూ ఉంటాయి. దాంతో భూమి కదిలి భూప్రకంపనలు, భూకంపాలు వస్తుంటాయి. ఇవే కాకుండా జపాన్‌ ట్రెంచ్‌గా పిలుస్తున్న జపనీస్‌ అగాధం కూడా భూకంపాలు రావడానికి మరో కారణం. పసిఫిక్‌ వాయువ్య ప్రాంతంలోని ఈ సముద్ర అగాధం 800 మీటర్ల లోతులో ఉంటుంది. అందులో కదలికలు ఏర్పడినప్పుడు భూకంపాలు, సునామీలు వస్తుంటాయి. 

విపత్తు తట్టుకునేలా నిర్మాణాలు

జపాన్‌ ఇల్లు(Home), కార్యాలయాలు అన్నీ భూకంపాలను తట్టుకునేలా నిర్మిస్తారు. అలాగే నిర్మించుకోవాలని అక్కడి చట్టం కూడా చెబుతోంది. అందు కోసం కొన్ని ప్రమాణాలను కూడా నిర్దేశించింది. పాఠశాలలు, కార్యాలయాల భవనాలు నిర్మించే సందర్భంలో తప్పని సరిగా చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఫలితంగా ఇప్పుడు జపాన్‌ రాజధాని టోక్యో(tokyo)లో 87 శాతం భవనాలు భూకంపాలను తట్టుకునే రీతిలో ఉన్నాయి. చాలా భవనాలు టెఫ్లాన్‌పై నిర్మిస్తారు. దాంతో కుదుపులను తట్టుకునే శక్తి ఉంటుంది. ఇంట్లో రబ్బరు అమరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. టోక్యోలోని ప్రసిద్ధ ఎత్తయిన కట్టడం స్కై ట్రీ(skytree)ని.. పురాతన కర్ర గోపురాల నిర్మాణాన్ని అనుకరిస్తూ కట్టారు. కర్రతో కట్టిన గోపురాలు దశాబ్దాలైనా చెక్కు చెదరలేదు. 

ఫోన్లు మోత మోగిస్తాయి..

జపాన్‌లోని ప్రతి మొబైల్‌(mobile)లో భూకంపం, సునామీల ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థ ఇన్‌స్టాల్‌ చేసి ఉంటుంది. ప్రమాదాలు జరగబోయే 5 నుంచి 10 సెకన్ల ముందే అవి అప్రమత్తం చేస్తాయి. జపనీస్‌ భాషలో ‘జిషిన్‌ దేసు..జిషిన్‌ దేసు’(భూకంపం వస్తోంది) అంటూ శబ్దాలు వెలువడతాయి. భూకంపం ముప్పు ఆగిపోగానే ఆ హెచ్చరికలు నిలిచిపోతాయి.

పసిగట్టే ట్రైన్‌లు

జపాన్‌లో రైళ్లలో ప్రయాణం చేసేవారు ఎక్కువ. అందుకే అక్కడ అత్యాధునిక బుల్లెట్‌ ట్రైన్లు(bullet train) నడుస్తున్నాయి. వాటిలో కూడా భూకంపాన్ని గ్రహించే సెన్సార్లు ఉన్నాయి. దాంతో విపత్తుకు ముందే అవి ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. 2011లో భారీ భూకంపం వచ్చినా అప్పటికే ట్రాక్‌పై నడుస్తున్న 27 రైళ్లు ముందే ఆగిపోయాయి. దాంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. 

టెలివిజన్‌ ప్రసారాలు

భూకంపం రాబోతోందనే సమాచారాన్ని జపాన్‌లోని టెలివిజన్‌(television) ఛానళ్లన్నీ ప్రసారం చేస్తాయి. ఎక్కడ ప్రమాదం ఉంది? తీవ్రత ఎలా ఉంటుంది? ఎక్కడ తలదాచుకోవాలి? ఎలా సన్నద్ధం కావాలి? ఇలాంటి ప్రశ్నలకు టీవీల ద్వారా జవాబు దొరుకుతుంది. 

పాఠశాలలో బోధన

విపత్తు సంభవించినప్పుడు పెద్దలే కాదు.. పిల్లలు కూడా వేగంగా స్పందించడం ముఖ్యం. అందుకే జపాన్‌ పాఠశాలల్లో విద్యతోపాటు విపత్తు నిర్వహణ అంశాలను పాఠ్యాంశాలు(syllabus)గా బోధిస్తారు. కనీసం నెలకోసారైనా అక్కడ భూకంపం వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిన విషయాలపై డ్రిల్‌ చేయిస్తారు. భూకంపం రాగానే చిన్నారులు డెస్క్‌ల కిందకి దూరిపోతారు. తీవ్రత తగ్గుముఖం పట్టే వరకు డెస్క్‌లను గట్టిగా పట్టుకొని కూర్చుంటారు. ఒక వేళ బయట ఆడుకుంటూ ఉంటే మైదానం మధ్యలోకి వెళతారు. దాంతో ఎలాంటి శిథిలాలు వారిపై పడవు. ఇవి మాత్రమే కాదు.. నిజంగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో అనుభూతి కలిగించే సిమ్యులేటర్ల(simulator)పై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. దాంతో భూకంపాలను ఎదుర్కొనే సామర్థ్యం వారిలో మెరుగవుతుంది. 

స్మారక మ్యూజియాలతో అవగాహన

గత అనుభవాల నుంచి జపాన్‌ ఎల్లప్పుడూ పాఠాలు నేర్చుకుంటూనే ఉంటుంది. 1995లో కోబ్‌ పట్టణంలో భారీ భూకంపం సంభవించగా దాదాపు 5వేల మంది మృత్యువాతపడ్డారు. 10వేలకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ పట్టణాన్ని పునర్నిర్మాణం చేసిన జపాన్‌ ‘కోబ్‌ భూకంప స్మారక మ్యూజియం’ను ఏర్పాటు చేసింది. దాన్ని సందర్శిస్తే భూకంపాలను ఎదుర్కొనేందుకు కావాల్సిన పరిజ్ఞానం పొందుతారు. 

అందరికీ రక్షణ కిట్స్‌

భూకంపం బారి నుంచి రక్షించుకునేందుకు జపాన్‌లోని ప్రతి ఇంటిలో రక్షణ కిట్స్‌ అందుబాటులో ఉంటాయి. వాటిలో ప్రథమ చికిత్స(first aid) వస్తువులు, నీటి సీసా, తిను బండారాలు, గ్లౌజ్‌లు, మాస్క్‌లు, ఇన్సులేషన్‌ షీట్స్‌, టార్చ్‌ లైట్‌, రేడియో తదితర వస్తువులుంటాయి. ఈ కిట్స్‌ మెడికల్‌, కిరాణా దుకాణాల్లో విక్రయిస్తుంటారు. 

నీటిని మళ్లించే టన్నెల్స్‌

భూకంపంతోపాటు, సునామీ వస్తే భారీగా నీరు టోక్యో నగరంలోకి వస్తుంది. ఆ నీటిని మళ్లించేందుకు నగర శివారులో భారీ టన్నెల్స్‌ను ఏర్పాటు చేశారు. తుపానులు, వరదల కారణంగా వచ్చిన నీరు మొత్తం ఈ టన్నెళ్ల ద్వారా ఎడో నదిలోకి మళ్లిస్తారు. 

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని