Sky diving : ఈ సాహసవీరులు.. స్కై డైవింగ్‌లో మృత్యుంజయులు!

పక్షిలా ఆకాశంలో ఎగురుతూ ప్యారాచూట్‌ సహాయంతో భూమిపైకి రావడం ఓ అద్భుతమైన అనుభూతి. గత కొన్నేళ్లుగా స్కై డైవింగ్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.

Published : 29 Mar 2023 12:30 IST

(Image : Instagram)

స్కై డైవింగ్‌(Sky diving) ఎంతో సాహసంతో కూడుకున్న ఓ విన్యాసం . మొదటి, రెండో ప్రపంచ యుద్ధం(world war)లో సైనికులు అవసరాన్ని బట్టి ప్యారాచూట్‌ జంప్‌(parachute jump) చేసేవారు. ఇటీవలి కాలంలో సామాన్యులు సైతం స్కై డైవింగ్(Sky diving) చేస్తున్నారు. 2018లో ఒక్క అమెరికాలోనే 33 లక్షల మంది స్కైడైవింగ్‌ చేశారంటే దీనికున్న ఆదరణ అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సాహసం చేసేటప్పుడు టైమ్‌ అందరికీ ఒకేలా ఉండదు. కొందరు ఏకంగా చావును చూస్తే.. చావు అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చిన వారు మరికొందరున్నారు. ఆ మృత్యుంజయులపై ఓ లుక్కేయండి.

డేర్‌ డెవిల్‌ ‘బేర్‌ గ్రిల్స్‌’

బేర్‌ గ్రిల్స్‌(Bare grills).. ప్రముఖ సాహస వీరుడు. బ్రిటన్‌(Britain)కు చెందిన ఈయన డిస్కవరీ ఛానల్లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ సిరీస్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1996లో ఆయన ఓ భయంకర ప్రమాదం బారినపడ్డారు. అప్పట్లో బేర్ ‘21 ఎస్‌ఏఎస్‌’ రెజిమెంట్‌లో శిక్షణ పొందేవారు. ఇది యూకేకు చెందిన ప్రత్యేక దళం. శిక్షణలో భాగంగా ఆయన ఆఫ్రికా దేశం జాంబియాలో విమానం(Flight) నుంచి కిందకి దూకారు. అప్పటికి విమానం 16వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. ఆ సమయంలో దురదృష్టవశాత్తూ ఆయన ప్యారాచూట్‌(parachute) తెరుచుకోలేదు. గాల్లోనే కొద్దిసేపు గింగిరాలు తిరిగారు. రిజర్వ్ చూట్‌ను తెరిచేందుకు కూడా పరిస్థితులు అనుకూలించలేదు. దాంతో బేర్‌ బలంగా నేలపై పడిపోయారు. ఫలితంగా వెన్నెముక దెబ్బతింది. ఇక నడవడం అసాధ్యమని ఆయనకు చికిత్స చేసిన వైద్యులు తేల్చేశారు. కానీ బేర్‌లోని పట్టుదల అతడిని తొందరగా నడిచేలా చేసింది. రెండేళ్ల వ్యవధిలోనే పూర్తిగా కోలుకున్నారు. ఆ తర్వాత మౌంట్ ఎవరెస్టును అధిరోహించి తన సంకల్పబలం ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు.

112వ జంప్‌లో ‘క్రిస్టైన్‌ మెకంజీ’

దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్టైన్‌ మెకంజీకి స్కై డైవింగ్‌లో విశేష అనుభవం ఉంది. 2004 కల్లా ఆమె 111 జంప్‌లు  విజయవంతంగా పూర్తి చేసింది. 112వ జంప్‌ను కాస్త విభిన్నంగా చేయడానికి ప్రయత్నించింది. ఆ క్రమంలో 11వేల అడుగుల ఎత్తు నుంచి దూకి దాదాపు ఆరు వేల అడుగుల ఎత్తు దిగే వరకు కూర్చున్న భంగిమలో ఉండిపోయింది. దాంతో ఆకాశం నుంచి భూమిని చేరుకొనే వేగం అమాంతం పెరిగిపోయింది. ఏదో ప్రమాదం జరగబోతోందని ఆమెకు అర్థమైంది. చివరి క్షణంలో మరీ ముఖ్యంగా ప్రధాన ప్యారాచూట్ తెరుచుకోలేదు. దాని కనెక్షన్‌ను తొలగించకుండానే రిజర్వ్‌ చూట్‌ తెరిచింది. ఫలితంగా రెండూ చుట్టుకుపోయి మెకంజీ గాల్లోనే గిరగిరా తిరుగుతూ వచ్చి కింద పడింది. ఆమె పొత్తికడుపు, ఇతర చోట్ల బలమైన గాయాలయ్యాయి. ఒక ట్రక్కు డ్రైవర్‌ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించాడు. దాంతో మెకంజీ బతికి బయటపడింది.

స్విట్జర్లాండ్‌లో ‘ఎమ్మా క్యారీ’

ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా క్యారీ 2013లో స్విట్జర్లాండ్‌ వెళ్లింది. ఆల్ప్‌ పర్వతాలపై ఫ్రీఫాల్‌ చేయాలనే కోరికతో ఆమె హెలికాప్టర్‌ ఎక్కింది. దాదాపు 14వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన తరువాత సంతోషంగా సెల్ఫీలు తీసుకుంది. కిందకి దూకి ఆ అనుభూతిని ఆస్వాదిస్తుండగా ఆమెకు అనుమానం వచ్చింది. అసాధారణ రీతిలో భూమిపైకి వెళ్తున్నట్లుగా తోచి తన పైనున్న ఇన్‌స్ట్రక్టర్‌ను పిలిచింది. అతని దగ్గర నుంచి సమాధానం రాలేదు. వెనక్కి తిరిగి చూస్తే మెయిన్‌, రిజర్వ్‌ ప్యారాచూట్‌లు రెండు సరిగా తెరుచుకోలేదు. అవి రెండూ ముడిపడి ఉన్నాయి. ఓ తాడు కూడా ఇన్‌స్ట్రక్టర్‌ గొంతుకు బిగుసుకుంది. దాంతో అతడికి మాట రాలేదు. ఏం జరుగుతుందో ఊహించే లోపే  ఇద్దరూ బలంగా నేలపై పడ్డారు. ఈ ప్రమాదంలో ఇన్‌స్ట్రక్టర్‌ మరణించగా.. ఎమ్మా పొత్తికడుపు, వెన్ను, దవడకు గాయాలయ్యాయి. దంతాలు ఊడిపోయి నోరు మొత్తం రక్తంతో నిండిపోయింది. చికిత్స తరువాత ఆమె నడవడం అసాధ్యమని వైద్యులు తేల్చిచెప్పారు. కానీ అంతా ఆశ్చర్యపోయేలా కోలుకుంది.  అప్పటి గాయాలు ఇంకా ఆమెను బాధిస్తూనే ఉన్నాయి.

జెండాను ఎగరేస్తూ ‘క్రీగ్‌ స్టీపుల్టన్‌’

అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్కై డైవర్‌ క్రీగ్‌ స్టీపుల్టన్‌. ఆ దేశ జెండాకు సంబంధించిన ఓ సాహసం నిమిత్తం విమానంలో 8వేల అడుగుల ఎత్తుపై నుంచి దూకాడు. అంతా సాఫీగా జరుగుతోందని భావించిన తరుణంలో ఆయన కాలు ఒక చోట చిక్కుకుపోయింది. దాంతో గాల్లోనే గిరగిరా తిరగాల్సి వచ్చింది. బ్యాకప్‌ చూట్‌ను తెరిచినా లాభం లేకపోయింది. కానీ వేగం మాత్రం నెమ్మదించి భూమిపై పడ్డాడు. ఫలితంగా క్రీగ్‌ చేయి విరిగింది. కొన్ని చోట్ల గాయాలయ్యాయి. ఈ ఘటన మొత్తం ఓ కెమెరామెన్‌ గాల్లో రికార్డు చేస్తూ ఉండిపోయాడు. అతనికి సాయం చేసే అవకాశమే లేకపోయింది.

ఇన్‌స్ట్రక్టర్‌ రక్షించిన బాలుడు ‘ఎలీజా అర్రాంజ్‌’

ఆస్ట్రేలియాకు చెందిన బాలుడు ఎలీజా అర్రాంజ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ టోనీ రోకోవ్‌ సహాయంతో తొలిసారి స్కైడైవ్‌ చేశాడు. 5వేల అడుగుల ఎత్తు నుంచి ఇద్దరూ కిందకి దూకారు. భూమిని చేరడానికి ఇంకా 66 అడుగులుండగా బలమైన గాలి వీచింది. దాంతో ఇద్దరూ అదుపుతప్పి కిందపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. టోనీ ఎలీజాను రక్షించి.. తాను ప్రాణాలు కోల్పోయాడు. ఎలీజా గాయాల నుంచి కోలుకున్నా వీల్‌ఛైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

25 సర్జరీలతో ‘క్యారోల్‌ ముర్రే రోడ్రిగ్జ్‌’

కెనడాలోని నోవా స్కాటియాకు చెందిన క్యారోల్‌ ముర్రే రోడ్రిగ్జ్‌ 1997లో స్కైడైవింగ్‌ నేర్చుకోవడం మొదలుపెట్టింది. శిక్షణలో రాటుదేలక ముందే ఆమె 3200 అడుగుల ఎత్తులో నడుస్తున్న విమానం నుంచి దూకేసింది. బలమైన గాలి వీయడంతో ఆమె పట్టుకోల్పోయి నేలపై పడింది. ఈ ప్రమాదంలో ఆమెకు లెక్కలేనన్ని గాయాలయ్యాయి. వాటి నుంచి కోలుకునేందుకు వైద్యులు 25 సర్జరీలు చేయాల్సి వచ్చింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని