Delusionship : ఒక్క హాయ్ చెప్పగానే ‘డెల్యూజన్ షిప్’.. ఊహాలోకంలో విహరిస్తున్నారట!
సామాజిక మాధ్యమాల్లో (Social media) అమ్మాయి ‘హాయ్’ చెప్పగానే కొందరు అబ్బాయిలు పులకరించిపోతుంటారు. రెండు మాటలు మాట్లాడగానే ఊహల్లో తేలిపోతుంటారు. ఈ వింత భావనకు ‘డెల్యూజన్షిప్’ (Delusionship) అని పేరు పెట్టారు. దాని కథేంటో తెలుసుకోండి.
ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల (Social media) వినియోగం ఎక్కువైంది. ఫేస్బుక్ (Facebook), ట్విటర్ (Twitter), ఇన్స్టాగ్రామ్ (Instagram), స్నాప్‌చాట్, లింక్డ్ ఇన్, టిక్‌టాక్ ఇలా ఏదోక దాంట్లో ఖాతా లేని యువతరం ఈ భూమిపై ఉండదంటే అతిశయోక్తి కాదేమో. ఇంకాస్త ముందుకెళ్లి కొందరు డేటింగ్ యాప్‌లలోనూ ఖాతాలు తెరుస్తున్నారు. ప్రొఫైల్ చూసి తమ ఆసక్తిని అవతలి వ్యక్తికి తెలియజేస్తున్నారు.
ఇలాంటి పరిచయాలు యువతరం ఆలోచనలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అవతలి వ్యక్తి నాలుగు సందేశాలు పంపించగానే కొందరు పగటి కలలు కంటున్నారు. ఇద్దరూ కలిసి బీచ్‌లో నడుస్తున్నట్లు, పిక్నిక్కు వెళ్లినట్టు, రాత్రి పూట నగరం మొత్తం బైక్‌పై షికారు చేసినట్లు.. చివరికి పెళ్లి కూడా చేసుకున్నట్లు అంతులేని ఊహల్లో విహరిస్తున్నారు. ఈ పరిస్థితినే సామాజిక మాధ్యమ పరిభాషలో ‘డెల్యూజన్ షిప్’ అని సంబోధిస్తున్నారు.
ఏంటీ డెల్యూజన్ షిప్?
‘డెల్యూజన్ షిప్’అనే పదం ఇటీవలి కాలంలో టిక్‌టాక్ ద్వారా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ‘డెల్యూజన్ ’ అంటే మాయ, భ్రమ, భ్రాంతి అనే అర్థాలు వస్తాయి. ఇలా భ్రమల్లో బతకడం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి ఎవరిలో అయినా ఉండే లక్షణాలేనని అంటున్నారు. నిజానికి ప్రతి ఒక్కరూ ఫాంటసీలు కలిగి ఉంటారని, అవి సందర్భాన్ని బట్టి వస్తుంటాయని పేర్కొంటున్నారు. అయితే ఎక్కువ సమయం అలా ఊహాలోకంలో విహరిస్తూ ఉండిపోతేనే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
డెల్యూజన్ షిప్‌తో ప్రమాదమా?
ఒక వ్యక్తి ‘డెల్యూజన్ షిప్’లో ఉన్నాడని తెలియగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒంటరి వ్యక్తులు తరచూ తాము ఇష్టపడే వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఏ కలర్, ఏ హీరో, ఏ ఆహారం అంటే వారికి ఇష్టమో తెలుసుకొని మనసులో దాచుకుంటారు. సందర్భాన్ని బట్టి వాటిని తమ బంధాన్ని బలపరచుకునేందుకు వాడుతుంటారు. ఇలా చేయడం ద్వారా అవతలి వ్యక్తితో సత్సంబంధాలను ఏర్పరచుకుంటారు.
అయితే ఇవన్నీ ఎదుటి వ్యక్తి ఆసక్తిపై కూడా ఆధారపడి ఉంటాయి. కొందరు సాధారణంగానే అందరితో మాట కలుపుతుంటారు. తమ మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం పెట్టుకోకుండా సందేశాలు పంపిస్తుంటారు. అలాంటి వారిని గుర్తించడంలో విఫలమైతే తప్పకుండా ఈ డెల్యూజన్ షిప్ ప్రభావానికి లోనయ్యే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. తనను అంగీకరించలేదనే నిజం తెలిసి తీవ్ర వేదనకు గురవుతారు. కొన్నిసార్లు ద్వేషం కూడా పెంచుకుంటారు.
ప్రేమికుల్లోనూ..
అమర ప్రేమికులు కూడా కొన్నిసార్లు డెల్యూజన్ షిప్‌లోకి వెళ్తుంటారు. తమ భాగస్వామితోనే కాకుండా ఇతరుల ఆకర్షణ వల్ల వారితో ఫాంటసీ ఏర్పడుతుంది. అవి కొన్నిసార్లు అనుకోకుండా జరుగుతుంటాయని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రిలేషన్షిప్ ప్రారంభ దశలో ఉన్నవారి బంధాన్ని బలపరచడంలో డెల్యూజన్ షిప్ సహాయపడుతుందని అంటున్నారు.
ఎప్పుడు అలెర్ట్ కావాలి?
డెల్యూజన్ కొన్ని సార్లు ఇన్ఫ్యాక్చువేషన్(మోహం)గా మారుతుంది. అది తారాస్థాయికి చేరినప్పుడు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అవతలి వ్యక్తి గురించి ఆలోచిస్తూ మితిమీరిన సమయం గడుపుతుంటే మనసు అదుపు తప్పుతున్నట్లుగా భావించాలి. ఆ మోహం కొనసాగే కాలాన్ని గమనించాలి. ఆ సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నామో పరిశీలించుకోవాలి. ఇవే కాకుండా తరచూ ఇష్టపడే వారి సామాజిక మాధ్యమ ఖాతాను అదే పనిగా చూడటం. ప్రతి పోస్టుకు లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం చేసినా శ్రుతి మించుతున్నట్లే. వారు ఎక్కడికెళ్లినా అనుసరించడం మరో ప్రమాదకరమైన లక్షణం. ఎదుటి వారి కోసం జీవన శైలిని మార్చుకోవడం కూడా ఈ కోవలోకే వస్తుంది.
ఈ ప్రశ్నలు కూడా వేసుకోవాలి
- మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మునుపటిలా మాట్లాడుతున్నారా?
- డెల్యూజన్షిప్లో ఉన్న కారణంగా మీ పనిలో నాణ్యత తగ్గిందా?
- సమయానుకూలంగా తింటున్నారా?.. నిద్ర పోతున్నారా?
వీటిలో ఏదైనా మార్పు ఉంటే తప్పకుండా మానసిక వైద్యులను సంప్రదించాలి.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Team India: కప్పు ముందు కనువిప్పు.. టీమ్ఇండియాకు ఓటమి నేర్పే పాఠాలెన్నో