Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 14 Mar 2023 17:12 IST

1.వారాహి వాహనంలో ఆవిర్భావ సభకు బయలుదేరిన పవన్‌

జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడ నుంచి మచిలీపట్నం బయలుదేరారు. ఆటోనగర్‌లో పవన్‌కు గజమాలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వారాహి వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా పవన్‌ ముందుకెళ్తున్నారు. కౌలు రైతుల కుటుంబ సభ్యులను పవన్‌ పరామర్శించి.. 47 కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. అవినాష్‌రెడ్డిని నాలుగు గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ

 మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు(Viveka Murder Case)లో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి(MP Avinash Reddy)ని సీబీఐ(CBI) అధికారులు నాలుగు గంటల పాటు విచారించారు. ఇవాళ ఉదయం 11.30 గంటల సమయంలో సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్‌రెడ్డిని సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ నేతృత్వంలో అధికారులు ప్రశ్నించారు. వివేకా హత్యకేసులో ఇప్పటి వరకు అవినాష్‌రెడ్డి విచారణకు హాజరు కావడం ఇది నాలుగో సారి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ₹29 వేలకే HP కొత్త ల్యాప్‌టాప్‌.. ఫీచర్లివే..

గూగుల్‌ క్రోమ్‌ ఓఎస్‌తో హెచ్‌పీ (HP) సరికొత్త ల్యాప్‌టాప్‌ తీసుకొచ్చింది. హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ 15.6 (HP Chromebook 15.6.) పేరుతో దీన్ని మంగళవారం విడుదల చేసింది. స్కూల్‌, కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ ల్యాప్‌టాప్‌ను తీర్చిదిద్దిన్నట్లు హెచ్‌పీ వెల్లడించింది. ఈ ల్యాప్‌ ఎంతో స్టైలిష్‌గా తీర్చిదిద్దినట్లు పేర్కొంది. చదువుతో పాటు గేమింగ్‌ కూడా సపోర్ట్‌ చేస్తుందని తెలిపింది. దీని ధరను రూ.28,999గా నిర్ణయించింది. రెండు రంగుల్లో లభించే ఈ ల్యాప్‌టాప్‌ను ఆన్‌లైన్‌లో దీన్ని కొనుగోలు చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. రేపట్నుంచే ఇంటర్‌ పరీక్షలు.. హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారా?

తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు(Inter exams) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు(Inter board) పరీక్ష హాల్‌ టిక్కెట్ల (exam hall tickets)ను విడుదల చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్‌ http://tsbie.cgg.gov.in/ నుంచి విద్యార్థులు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది.  ఎస్‌ఎస్‌సీ హాల్‌ టిక్కెట్‌; పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి ఇంటర్‌ మొదటి సంవత్సర హాల్‌ టిక్కెట్లు పొందొచ్చు. అలాగే, గతేడాది పరీక్ష రాసిన హాల్‌టిక్కెట్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులు తమ పరీక్ష హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. నాలుగోరోజూ నష్టాలే.. 17,050 దిగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాలనే చవి చూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 337.66 పాయింట్లు నష్టపోయి 57,900.19 వద్ద ముగియగా... ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 111 పాయింట్ల నష్టంతో 17,043.30 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.57గా నిలిచింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఎమ్‌ అండ్‌ఎమ్‌, టీసీఎస్‌ తదితర షేర్లు నష్టాల పాలవ్వగా..బీపీసీఎల్‌, టైటాన్‌, భారతీ ఎయిర్‌టెల్‌ తదితర షేర్లు లాభాల బాటపట్టాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. గ్రూప్‌-1 పేపర్‌నూ ప్రవీణ్‌ లీక్‌ చేశాడా?.. వెలుగులోకి కొత్త విషయాలు

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో నిందితుడు ప్రవీణ్‌కు సంబంధించిన మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అతడు గ్రూప్‌-1 పరీక్ష రాసినట్లు వెల్లడైంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్‌ పేపర్‌ను అతడు లీక్‌చేశాడా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ప్రవీణ్‌ రాసిన పేపర్‌తో పాటు అతడికి వచ్చిన కోడ్‌ ప్రశ్నపత్రాన్ని పోలీసులు, టీఎస్‌పీఎస్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాలు వచ్చిన సర్వర్‌ను సైబర్‌ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఇంటర్నెట్‌లో చూశా.. రూ.25 వేలు కట్టను.. : ప్రయాణికుడి వాదన!

ఇటీవల ఎయిర్‌ ఇండియా(Air India) విమానంలో ఓ వ్యక్తి సిగరెట్‌ తాగడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తన అనుచిత ప్రవర్తన(Unruly Behaviour)తో తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన అతడిని.. కాళ్లు, చేతులు కట్టేసి సీటులో కూర్చొబెట్టారు. అనంతరం విమానయాన సిబ్బంది ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే కోర్టు అతడికి బెయిల్‌ మంజూరు చేసినా.. తన ‘ఇంటర్నెట్‌’ వాదనతో దాన్ని నిరాకరించి, జైలుకే వెళ్తానని చెప్పడం గమనార్హం. దీంతో కోర్టు అతడిని జైలుకు తరలించాలని ఆదేశించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8.ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ)(TSPSC)లో పేపర్ల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తును ముమ్మరం చేసినట్లు అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌ తెలిపారు. కేసు దర్యాప్తుపై విక్రమ్‌సింగ్‌ వివరణ ఇస్తూ.. ‘‘గ్రూప్‌-1 (Group-1) పేపర్‌ లీక్‌ అయినట్లు మా దృష్టికి రాలేదు. ఇప్పటివరకు ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. దర్యాప్తులో భాగంగా నిందితుడు ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌లో ఏడుగురి మహిళల నగ్న చిత్రాలను గుర్తించాం. సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాం. ప్రస్తుతం ఏఈ పేపర్‌ లీకేజీకి సంబంధించిన కేసు దర్యాప్తు మాత్రమే కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రవీణ్‌తో పాటు 9 మందిని అరెస్టు చేశాం. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నాం’’ అని విక్రమ్‌సింగ్‌ స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. మూడేళ్ల తర్వాత తెరుచుకోనున్న చైనా సరిహద్దులు..

కొవిడ్‌ నుంచి ఈ మధ్యనే కోలుకున్న చైనా (China).. సుదీర్ఘ విరామం అనంతరం తొలిసారి తన సరిహద్దులను తెరవనుంది. పర్యాటకులను (tourists) మునుపటిలా దేశంలోకి అనుమతించనుంది. బుధవారం నుంచి అన్ని రకాల వీసాలను (Visa) పునరుద్ధరించనుంది. కొవిడ్‌ కారణంగా దాదాపు మూడేళ్ల పాటు చైనా తన సరిహద్దులను మూసేసింది. దీంతో వృద్ధి నెమ్మదించింది. పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం సైతం పడిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటక రంగాన్ని గాడిన పెట్టేందుకు మూడేళ్ల తర్వాత సరిహద్దులు తెరిచేందుకు చైనా నిర్ణయించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10.  టాయిలెట్‌ సీట్‌ మీద కంటే.. బాటిల్‌పైనే బ్యాక్టీరియా అధికమట..!

మనం వెళ్లిన ప్రతిచోటా నీటిని కొనుక్కోలేక.. వెంట తాగునీటి బాటిళ్లను తీసుకెళ్తుంటాం. అలాగే పరిశుభ్రమైన నీటిని తాగే ఉద్దేశంతో పాఠశాలలు, కార్యాలయాలకు వాటిని మోసుకెళ్తుంటాం. కానీ పునర్వినియోగ బాటిళ్ల(Reusable bottles)పై మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా( Bacteria) ఉంటుందట. టాయిలెట్ సీటుపై కంటే కూడా 40వేల రెట్లు అదనంగా బ్యాక్టీరియా వీటి మీద ఉంటుందట. రకరకాల బాటిల్ మూతల నుంచి అమెరికాకు చెందిన ‘వాటర్‌ఫిల్టర్‌గురు. కామ్‌’ నమూనాలను సేకరించి పరిశోధించింది. ఈ క్రమంలో వారు గ్రామ్-నెగెటివ్ రాడ్స్(gram-negative rods), బాసిల్లస్‌(bacillus) వంటి రెండు రకాల బ్యాక్టీరియాను గుర్తించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని