Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Feb 2023 13:11 IST

1. అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్: కోటంరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్

తన ఫోన్‌ ట్యాప్‌ చేశారంటూ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy).. ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయలేదని, న్యాయస్థానాలను ఎందుకు ఆశ్రయించలేదని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Kakani Govardhanreddy) ప్రశ్నించారు. అది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదు.. మ్యాన్‌ ట్యాపింగ్‌ అని ఆక్షేపించారు. శ్రీధర్‌రెడ్డిని తెదేపా అధినేత చంద్రబాబు ట్యాప్‌ చేశారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో కోటంరెడ్డి చేసిన విమర్శల నేపథ్యంలో నెల్లూరులోని వైకాపా (YSRCP) జిల్లా కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రివ్యూ: రైట‌ర్ ప‌ద్మభూష‌ణ్‌

విజ‌య‌వాడ పుస్తక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ మొద‌ల‌య్యే క‌థ ఇది. ర‌చ‌యిత‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాల‌ని, పెద్ద ర‌చ‌యిత‌ల స‌ర‌స‌న త‌న‌ని చూసుకోవాల‌ని క‌ల‌లు క‌నే యువ‌కుడి పాత్ర చుట్టూ సాగుతుంది. ఈ నేప‌థ్యం కొత్తదే.  ర‌చ‌న‌వైపు దృష్టిపెడుతున్న నేటి యువ‌త‌రం త‌క్కువే కానీ, క‌థానాయకుడి పాత్రని అమాయ‌క‌త్వంతో తీర్చిదిద్ది అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా చేశాడు ద‌ర్శకుడు. ఇంటిల్లిపాదీ క‌లిసి ఆస్వాదించేలా హాస్యం, మ‌లుపులు, సందేశాన్ని మేళ‌వించి క‌థ‌ని అల్లిన తీరు ఆక‌ట్టుకుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్‌ ట్యాపింగ్‌.. ఆషామాషీగా జరగదు: కోటంరెడ్డి

అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా, నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (kotamreddy) అన్నారు. ఆఖరి దాకా ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పని.. కానీ తాను అలా చేయలేదన్నారు. ఇటీవల ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ కోటంరెడ్డి చేసిన ఆరోపణలపై వైకాపా నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. నెల్లూరులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అమెరికా అణ్వాయుధ స్థావరంపై చైనా నిఘా బెలూన్‌..!

అమెరికాలోని అణు స్థావరంపై చైనా వదిలిన ఓ భారీ హై ఆల్టిట్యూడ్‌ బెలూన్‌ను గుర్తించారు. ఈ విషయాన్ని పెంటగాన్‌ స్వయంగా వెల్లడించింది. ఈ బెలూన్‌ను అమెరికా నిఘా వర్గాలు కొంతకాలంగా ట్రాక్‌ చేస్తున్నాయి. వాణిజ్య విమానాలు ప్రయాణించే ఎత్తు కంటే పైన ఇది ప్రయాణిస్తోందని పెంటగాన్‌ ప్రతినిధి పాట్రిక్‌ రైడర్‌ పేర్కొన్నారు. అది ఉత్తర అమెరికా గగనతలంలో ప్రయాణిస్తోంది. దీనిని కూల్చేస్తే శకలాలు నేలపై పడి ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సీనియర్‌ అధికారులు.. అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. స్పిన్‌ ఎదుర్కోవడం కోహ్లీకి కాస్త కష్టమే.. కింగ్‌కు మాజీ ఆటగాడి సూచన ఇదే..!

మరికొద్ది రోజుల్లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ (Border-Gavaskar Trophy) జరగనుంది. ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే నాగ్‌పుర్‌ చేరుకున్న టీమ్‌ఇండియా (Team India) జట్టు తొలి టెస్టు కోసం సాధన మొదలుపెట్టింది. ఈ సిరీస్‌లో క్రికెట్‌ అభిమానుల కళ్లన్నీ విరాట్‌ కోహ్లీ (Virat Kohli)పైనే. పరిమిత ఓవర్లలో తిరిగి ఫామ్‌లోకి వచ్చి రికార్డులు సృష్టిస్తున్న ఈ పరుగుల రారాజు.. టెస్టుల్లోనూ సత్తా చాటాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ సందర్భంగా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్ (Irfan Pathan)‌.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మరోసారి అమూల్‌ పాల ధరల పెంపు

అమూల్‌ పాల ధరలు (Amul milk price) మరోసారి పెరిగాయి. అన్ని రకాల పాలపై ధరలు పెంచుతున్నట్లు అమూల్‌ బ్రాండ్‌ పేరిట మార్కెటింగ్‌ చేసే ‘గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (GCMMF)’ గురువారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. గుజరాత్‌ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన ధరలు అమలవుతాయని ఫెడరేషన్‌ సీనియర్‌ మేనేజర్‌ (సేల్స్‌) ప్రకాశ్‌ ఆటే తెలిపారు. లీటర్‌ పాలపై రూ.2 వరకు పెంచినట్లు ఎండీ జయేన్‌ మెహతా శుక్రవారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అలా చేస్తే.. 2030 కల్లా భారత్‌ దివాలా తీయడం ఖాయం: హరియాణా సీఎం కీలక వ్యాఖ్యలు

కొన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పింఛను విధానం(ఓపీఎస్‌)(OPS) అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దీనిని ఉద్దేశించి హరియాణా(Haryana) ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌(Manohar Lal Khattar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓపీఎస్‌ను అమలు చేస్తే.. 2030 నాటికి భారత్‌ దివాలా తీస్తుందన్నారు. చండీగఢ్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న నాకు వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది. ఓపీఎస్‌ను  అమలు చేస్తే.. 2030 కల్లా దేశం దివాలా తీస్తుందని ఆ సందేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వెల్లడించారు’ అని సీఎం వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కె.విశ్వనాథ్‌ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!

ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి, ఆహార్యం ఉంటాయి. కోడి రామకృష్ణ తలకు క్లాత్‌ కట్టుకుంటారు. రాఘవేంద్రరావు దాదాపు గడ్డంతోనే కనిపిస్తారు. షూటింగ్‌ జరిగినన్ని రోజులు రాజమౌళి కూడా పరిస్థితి కూడా దాదాపు అంతే. లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మెగాఫోన్‌ పడితే ఒంటిపై ఖాకీ దుస్తులు ఉండాల్సిందే. దీని గురించి ఓ సందర్భంగా కె.విశ్వనాథ్‌ స్వయంగా పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. డోజోన్స్‌ కీలక సూచీ నుంచి ‘అదానీ’ ఔట్‌.. ఇన్వెస్టర్లలో విశ్వాసం కోసం చర్యలు!

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికతో ప్రారంభమైన అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీల షేర్ల పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా ఈ స్టాక్స్‌ భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను ‘సస్టైనబిలిటీ ఇండిసెస్‌’ నుంచి తొలగిస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ డోజోన్స్‌ వెల్లడించింది. అందుకనుగుణంగా ‘డోజోన్స్‌ సస్టైనబిలిటీ ఇండిసెస్‌ (Dow Jones sustainability indices)’కు ఫిబ్రవరి 7న సవరణలు చేయనున్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వివేకా హత్య కేసు.. సీబీఐ ముందుకు జగన్‌ ఓఎస్డీ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఓఎస్డీ కృష్ణ మోహన్‌ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. అవినాష్‌ రెడ్డి ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా గతంలో కృష్ణ మోహన్‌ రెడ్డితో పాటు వైఎస్ భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ  క్రమంలో కడప కేంద్ర కారాగారంలో సీబీఐ విచారణకు ఈరోజు వీరిద్దరూ హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు