EC: లోక్‌సభలో 543 సీట్లు.. 544 స్థానాలకు ఈసీ షెడ్యూల్‌.. ఎందుకంటే?

దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలుండగా.. ఈసీ మాత్రం 544 పార్లమెంటు స్థానాలకు షెడ్యూల్‌ ప్రకటించింది.

Updated : 17 Mar 2024 09:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Elections) కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే, దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలుండగా.. ఈసీ మాత్రం 544 పార్లమెంటు స్థానాలకు షెడ్యూల్‌ ప్రకటించింది. దీంతో ఇది చూసిన వారికి కాస్త గందరగోళంగా అనిపించింది. అయితే, ఈశాన్య రాష్ట్రంలో ఒక పార్లమెంటు స్థానానికి రెండు దశల్లో పోలింగ్‌ జరగడమే ఇందుకు కారణం.

ఈసీ శనివారం ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌లో మొత్తం 544 పార్లమెంటు స్థానాలున్నాయి. కొత్తగా మరో పార్లమెంటరీ స్థానం చేరలేదు. అలా అని తప్పుగానూ ప్రకటించలేదు. ఇదే విషయంపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ను మీడియా ప్రశ్నించగా.. వివరణ ఇచ్చారు. ఔటర్‌ మణిపుర్‌ నియోజకవర్గంలో చోటుచేసుకున్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇక్కడ రెండు దఫాల్లో పోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

మణిపుర్‌లో ఇన్నర్‌, ఔటర్‌ మణిపుర్‌ లోక్‌సభ స్థానాలుండగా.. అందులో ఏప్రిల్‌ 19, 26 తేదీల్లో అక్కడ పోలింగ్‌ జరగనుంది. ఇన్నర్‌ మణిపుర్‌తోపాటు ఔటర్‌ మణిపుర్‌కు చెందిన పలు సెగ్మెంట్లలో తొలి, రెండోదశలో పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలో ఇటీవల నెలకొన్న ఘర్షణల కారణంగా అక్కడ ఇలా పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని