అణ్వాయుధ నిషేధానికి 50దేశాలు ఆమోదం!

అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందంపై ఇప్పటివరకు 50దేశాలు ఆమోదం తెలిపినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీంతో వచ్చే 90రోజుల్లోనే ఈ నిషేధం అమలులోకి రానుంది.

Published : 26 Oct 2020 00:43 IST

త్వరలోనే అమల్లోకి రానున్న అంతర్జాతీయ ఒప్పందం

న్యూయార్క్‌: అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందంపై ఇప్పటివరకు 50దేశాలు ఆమోదం తెలిపినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీంతో వచ్చే 90రోజుల్లోనే ఈ నిషేధం అమలులోకి రానుంది. ఈ అంతర్జాతీయ ఒప్పందానికి 50దేశాలు ఆమోదం తెలపడం చారిత్రక మైలురాయిగా ఐరాస అభివర్ణించింది. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిన దేశాలను ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ అభినందించారు. అణుపేలుళ్లు, అణు పరీక్షల నుంచి బయటపడిన వారికి వందనం చేసిన ఆయన, వీటి నిషేధం కోసం వారి చేసిన పోరాటాన్ని కొనియాడారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే అణ్వాయుధాల వాడకం వల్ల కలిగే విపత్కర పరిణామాలపై ప్రపంచానికి చాటిచెప్పడం మరింత సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు.

అణ్వాయుధాలను నిషేధంపై జరిగిన ‘ట్రీటీ ఆన్‌ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌(TPNW)’ఒప్పందం అమలులోకి రావడానికి ప్రపంచవ్యాప్తంగా కనీసం 50దేశాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తాజాగా హోండూరస్‌ దీన్ని ఆమోదించడంతో అణ్వాయుధ నిషేధానికి మార్గం సుగమమైంది. దీంతో వచ్చే 90రోజుల్లోనే ఇది అమలులోకి రానుంది. అనగా, 22 జనవరి 2021 నుంచి అణ్వాయుధాల నిషేధం అమలులోకి వస్తుంది. అయితే, అమెరికాతో పాటు అణ్వాయుధాలు కలిగిన శక్తిమంతమైన దేశాలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బ్రిటన్‌, చైనా, ఫ్రాన్స్‌, రష్యా దేశాలు కూడా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. అంతేకాకుండా ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని అమెరికా గట్టిగా వాదిస్తోంది. 

రెండో ప్రపంచ యుద్ధం కాలంలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణ్వాయుధ ప్రయోగ ప్రభావం ఇప్పటికీ సాక్షాత్కరిస్తూనే ఉంది. అప్పటినుంచి వీటిపై నిషేధం విధించాలని అంతర్జాతీయంగా పౌర సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలోనే ఐక్యరాజ్యసమితి కూడా ఏర్పడింది. ఇలా 75సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత అణ్వాయుధ నిషేధం అమలులోకి రానుంది. ఈ ఒప్పందం ప్రకారం, అణ్వాయుధాలు లేదా ఇతర అణు పేలుడు పరికరాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, తయారు చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం వంటివి నిషేధం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని