కస్టమ్స్‌ అధికారులుగా అవతారమెత్తి.. రూ.లక్షల్లో కాజేసి..

కస్టమ్స్‌ అధికారులమంటూ(Customs Officials) ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మడంతో ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. దీనిపై అతడు పోలీసులను ఆశ్రయించాడు. 

Published : 27 Jun 2023 14:23 IST

దిల్లీ: నకిలీ అధికారుల చేతిలో ఓ వ్యక్తి దారుణంగా మోసపోయాడు. కస్టమ్స్‌ అధికారుల(Customs Officials)మంటూ వారు చెప్పిన మాటలు నమ్మడంతో వెంట తెచ్చుకున్న నగదు మొత్తం పోగొట్టుకున్నాడు. తర్వాత తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం..

రాజస్థాన్‌( Rajasthan)లోని అజ్మేర్‌కు చెందిన 53 ఏళ్ల మహమ్మద్‌ సులేమాన్.. సౌదీ అరేబియా(Saudi Arabia)లో పనిచేస్తున్నాడు. ఆదివారం అతడు భారత్‌కు వచ్చాడు. తెల్లవారుజామున దిల్లీలోని విమానాశ్రయం(Delhi Airport)లో దిగాడు. తర్వాత విమానాశ్రయం బయటకు చేరగానే.. ఇద్దరు వ్యక్తులు అతడి దగ్గరకు వచ్చి, తాము కస్టమ్స్‌ అధికారులమని చెప్పారు. వారి మాటలు నమ్మిన అతడు.. వారు చెప్పినట్టుగా పార్కింగ్ ప్రాంతానికి వెళ్లాడు.  అక్కడ వారు అతడి పాస్‌పోర్టు తీసుకున్నారు.

అక్కడి నుంచి మరోవ్యక్తి తెచ్చిన కారులో మహిపాల్‌పుర్‌కు తీసుకెళ్లారు. ఒక నిర్జన ప్రాంతంలో కారు ఆపి, అతడి ఫోన్‌, 19వేల సౌదీ రియాల్‌లు(సమారు రూ.4.15 లక్షలు), రెండువేల రూపాయలు లాగేసుకున్నారు. ఈ డబ్బు, ఫోన్ ఎక్కడిదని విచారించారు. ఆ తర్వాత అతడిని బలవంతంగా కారునుంచి దించి, అక్కడి నుంచి ఉడాయించారు. వెళ్తూవెళ్తూ.. మరో సీనియర్ అధికారిని తీసుకువస్తామని చెప్పారు. తర్వాత వారి జాడలేకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన సులేమాన్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని