Air India: ఇజ్రాయెల్ - హమాస్‌ పోరు.. ప్రయాణికులకు ఎయిరిండియా ఊరట

ఇజ్రాయెల్ - హమాస్‌ ఉద్రిక్తతల వేళ.. విమాన ప్రయాణికులకు ఎయిరిండియా (Air India) ఊరటనిచ్చే విషయం చెప్పింది. ఆ దేశానికి టికెట్లను క్యాన్సిల్‌ చేసుకున్నవారికి ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.

Published : 10 Oct 2023 14:05 IST

దిల్లీ: హమాస్‌ (Hamas) మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్‌ (Israel)లో యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) కీలక నిర్ణయం తీసుకుంది. టెల్‌ అవీవ్‌కు రాకపోకల కోసం బుక్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటే వాటిపై ఛార్జీలను ఎత్తివేస్తూ ప్రయాణికులకు కాస్త ఊరట కల్పించింది.

‘‘టెల్‌ అవీవ్‌ (Tel Aviv) నుంచి వచ్చేందుకు లేదా అక్కడకు వెళ్లేందుకు బుక్‌ చేసిన టికెట్లను క్యాన్సిల్‌ /రీషెడ్యుల్‌ చేసుకుంటే వాటిపై ఛార్జీలను ఒకసారికి రద్దు (One Time Ticket Waiver) చేస్తున్నాం. అక్టోబరు 31 వరకు ప్రయాణాల కోసం అక్టోబరు 9వ తేదీకి ముందు బుక్‌ చేసుకున్న టికెట్లపై ఈ ఆఫర్‌ వర్తిస్తుంది’’ అని ఎయిరిండియా ఎక్స్‌ వేదికగా వెల్లడించింది.

1500 మంది హమాస్‌ మిలిటెంట్లు హతం.. ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడి

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే భారత్‌ నుంచి ఇజ్రాయెల్‌కు రాకపోకలు సాగించే విమానాలను ఎయిరిండియా రద్దు చేసిన విషయం తెలిసిందే. ‘ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా.. టెల్ అవీవ్‌కు రాకపోకలు సాగించే ఎయిర్‌ ఇండియా విమానాలను అక్టోబరు 14 వరకు నిలిపివేస్తున్నాం’ అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తేదీల్లో టికెట్‌ కన్ఫామ్‌ అయిన ప్రయాణికులకు అన్ని విధాలా తోడ్పాటునందిస్తామని పేర్కొంది.

ఎయిరిండియాతో పాటు దాదాపు అన్ని ప్రధాన విమానయాన సంస్థలు ఇజ్రాయెల్‌కు విమానాలను నిలిపేశాయి. ఇందులో అమెరికా సంస్థలు అధికంగా ఉన్నాయి. ఇక, హమాస్‌ (Hamas) మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ (Israel) సైన్యానికి మధ్య నాలుగో రోజు పోరు కొనసాగుతోంది. తమ దేశంలోకి చొరబడిన 1500 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని