Akhilesh Yadav: ‘మణిపుర్‌’పై మాట్లాడితే మీకే మంచిదిగా..!: యోగికి అఖిలేశ్‌ సెటైర్‌

మణిపుర్ అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోందని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ అన్నారు. దీనిపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) స్పందిస్తే ఆయనకే మంచిదని వ్యాఖ్యానించారు. 

Published : 07 Aug 2023 17:43 IST

లఖ్‌నవూ: ఈశాన్యరాష్ట్రం మణిపుర్‌(Manipur Issue)లో కొనసాగుతోన్న ఉద్రిక్తతలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ అల్లర్లు ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చాయి. సోమవారం సమావేశాల మొదటి రోజున ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath) ఆ అంశంపై ప్రకటన చేయాలని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్(Akhilesh Yadav) డిమాండ్ చేశారు.  

‘ఈ భూమిపై మణిపుర్ అంశాన్ని విమర్శించని ప్రదేశం లేదు. అమెరికా, ఐరోపా నుంచి కూడా దీనిపై స్పందన వచ్చింది’ అని అఖిలేశ్ మాట్లాడుతుండగా.. ఆయన్ను స్పీకర్ వారించారు. ‘అక్కడ జరిగింది దురదృష్టకరం. కానీ ఆ విషయాన్ని మాట్లాడటానికి ఇది వేదిక కాదు’ అని అన్నారు. ఆ వెంటనే అఖిలేశ్‌.. ముఖ్యమంత్రి(Yogi Adityanath) వైపు తిరిగి మాట్లాడారు. ‘మీరు పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తుంటారు. అందుకే ఈ దేశం గొంతుకగా మారడానికి మీకిది మంచి అవకాశం’ అని సెటైరికల్‌గా మాట్లాడారు. అయితే దీనిపై యోగి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 

మణిపుర్‌ హింస.. మహిళా మాజీ జడ్జీలతో కమిటీ ఏర్పాటు

సభలో కార్యకలాపాలు ప్రారంభంకాగానే మణిపుర్ అంశంపై చర్చ జరపాలని సభ్యులు వెల్‌ వద్దకు దూసుకొచ్చారు. ‘మణిపుర్‌పై చర్చ జరిపితే.. మనం కేరళ, పశ్చిమ్ బెంగాల్‌పై కూడా చర్చించాల్సి ఉంటుంది’అని స్పీకర్ సభ్యులకు వెల్లడించారు. సభలో ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి చర్చ ఉండదని, నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నడుస్తాయని స్పష్టం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని