Kejriwal: ‘ఆప్‌ను అడ్డుకునేందుకు దేశవ్యతిరేక శక్తుల ప్రయత్నం..!’

దేశ ప్రగతిని నిరోధించాలనుకునే శక్తులన్నీ ఆప్‌ను అడ్డుకోవాలని చూస్తున్నాయని పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. పార్టీకి జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో మంగళవారం ఆయన ప్రసంగించారు.

Published : 12 Apr 2023 00:12 IST

దిల్లీ: భారత్‌ ప్రగతిని నిరోధించాలనుకునే దేశ వ్యతిరేక శక్తులన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. ఆప్‌నకు జాతీయ పార్టీ హోదా (National Party Status) దక్కిన నేపథ్యంలో.. పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కేజ్రీవాల్‌ ప్రసంగించారు. పదేళ్ల స్వల్ప వ్యవధిలోనే తమ పార్టీ జాతీయ హోదా సాధించడాన్ని అద్భుతం, నమ్మశక్యం కాని విజయంగా అభివర్ణించారు. ఈ క్రమంలోనే పార్టీపై పెద్ద బాధ్యత కూడా వచ్చి చేరినట్లు చెప్పారు. ‘దేశం కోసం ప్రాణాలు విడిచేందుకయినా సిద్ధపడి ఆప్‌లోకి వచ్చాం. పదవి, డబ్బుపై అత్యాశ ఉన్నవారు పార్టీని వీడాలి. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

‘భారత్‌ అభివృద్ధికి ఆటంకం కలిగించాలనుకునే దేశ వ్యతిరేక శక్తులన్నీ ఆప్‌ను అడ్డుకోవాలని చూస్తున్నాయి. అయితే భగవంతుడు మాతోనే ఉన్నారు’ అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. నిజాయతీ, దేశభక్తి, మానవత్వం అనే మూడు స్తంభాలపై పార్టీ సిద్ధాంతం ఆధారపడి ఉందన్నారు. ఆప్‌ ఎదుగుదలతోపాటు జాతీయ పార్టీ హోదా సాధించడంలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జైల్లో ఉన్న మనీశ్‌ సిసోదియా, సత్యేందర్ జైన్‌లను కేజ్రీవాల్‌ గుర్తు చేసుకున్నారు. భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మార్చడమే ఆప్‌ లక్ష్యమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పిస్తూ ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ నేతృత్వంలో 2012లో ఈ పార్టీ ఏర్పాటైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు