Deepotsav: ఒకేసారి 22.23 లక్షల దీపాలు.. అయోధ్య గిన్నిస్‌ రికార్డు

సరయూ నదీ తీరంలో ఒకేసారి 22 లక్షలకుపైగా దీపాలను వెలిగించి అయోధ్య గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించింది.

Published : 12 Nov 2023 02:04 IST

అయోధ్య: దీపావళి (Diwali) పండగను పురస్కరించుకొని అత్యధిక దీపాలు వెలిగించి యూపీలోని అయోధ్య(Ayodhya) ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఒకేసారి 22.23 లక్షలకుపైగా దీపాలు వెలిగించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. సరయూ నదీతీరంలో దీపావళికి ఒకరోజు ముందు ‘దీపోత్సవ్‌ (Ayodhya Deepotsav)’ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది 15 లక్షల దీపాలు వెలిగించి తాను నెలకొల్పిన రికార్డును ఈ ఏడాది అయోధ్య బద్దలు కొట్టింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 25 వేల మందికిపైగా వాలంటీర్లు భాగస్వాములయ్యారు.

2017లో యూపీలో భాజపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా అయోధ్యలో ఈ దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది 51వేల దివ్వెలను వెలిగించగా.. ఆ తర్వాత 2018లో దాదాపు 3లక్షల దీపాలను వెలిగించారు. ఆ ఏడాది దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్‌ జంగ్‌ సూక్‌ ముఖ్య అతిథిగా హాజరై.. ఆ వేడుకను వీక్షించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న వేళ.. ఈ ఏడాది ఈ దీపోత్సవ్‌ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. 50 దేశాలకు చెందిన  రాయబారులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీపోత్సవ్‌కు ముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 2019లో 4.10లక్షలు, 2020లో దాదాపు 6లక్షలు, 2021లో 9లక్షలకు పైగా దీపాలను వెలిగించి అయోధ్య గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని