Bill Gates: రోటీ చేసిన బిల్‌గేట్స్‌.. ఇది కూడా ట్రై చేయండన్న మోదీ

అపర కుబేరుడు, దాత బిల్‌ గేట్స్‌ ( Bill Gates) చెఫ్‌గా మారి రోటీ చేశారు. దీంతో ఆయనపై ప్రశంసలు కురిపించిన భారత ప్రధాని నరేంద్రమోదీ (Modi) ఓ సలహా కూడా ఇచ్చారు.

Published : 04 Feb 2023 15:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) చెఫ్‌గా మారారు. గరిటె తిప్పి భారత వంటకాన్ని తయారుచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో గేట్స్‌ నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు భారత ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi). అంతేనా.. ఈసారి తృణధాన్యాలతో వంటకాలు ట్రై చేయండంటూ సలహా కూడా ఇచ్చారు.

బిల్‌గేట్స్‌ (Bill Gates)తో కలిసి ప్రముఖ సెలబ్రిటీ చెఫ్‌ ఐటన్‌ బెర్నాత్‌ ఓ కుకరీ వీడియో చేశారు. ఇందులో గేట్స్‌ భారతీయ వంటకమైన రోటీ (Roti) తయారుచేశారు. గోధుమ పిండి కలిపి చపాతీ చేసి కాల్చారు. ఆ తర్వాత ఇద్దరూ ఆ రోటీలని రుచిచూశారు. ఈ వీడియోను గేట్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘మేమిద్దరం కలిసి రోటీని తయారు చేశాం. ఐటన్‌ ఇటీవల భారత్‌లో పర్యటించి వచ్చారు. ఆ సయమంలో బిహార్‌లో గోధుమ రైతులను కలిసి వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ‘‘దీదీ కా రసోయ్ (Didi ka Rasoi)‌’ కమ్యూనిటీ క్యాంటీన్‌లోని మహిళలను కలిసి వారి నుంచి రోటీలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు’’ అని గేట్స్‌ రాసుకొచ్చారు.

ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi) ఈ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేస్తూ.. గేట్స్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘సూపర్‌. ఇప్పుడు భారత్‌లో మిల్లెట్స్‌ (తృణధాన్యాలు) ట్రెండ్‌ నడుస్తోంది. అవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. తృణధాన్యాలతోనూ ఎన్నో వంటకాలు చేయొచ్చు. వాటిని కూడా ట్రై చేయండి’’ అంటూ గేట్స్‌ (Bill Gates)ను సూచిస్తూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని