PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు 370 సీట్లకు పైనే..: మోదీ

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాదే మళ్లీ విజయమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మధ్యప్రదేశ్‌లో పర్యటించిన ఆయన ₹7,550 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.

Updated : 11 Feb 2024 15:24 IST

ఝబువా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) భాజపా 370కి పైగా స్థానాలను గెలుచుకొంటుందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కో బూత్‌లో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూడాలని, 370 స్థానాలకు పైగా భాజపా గెలిచేలా ఆశీర్వదించాలని కార్యకర్తలను, ఓటర్లను కోరారు. ఆదివారం మధ్యప్రదేశ్‌లో పర్యటించిన ప్రధాని.. ₹7,550 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఝబువా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసమే తాను ఇక్కడికి రాలేదని.. ప్రజా సేవకుడిగా మాత్రమే వచ్చానని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం రెట్టింపు వేగంతో పనిచేస్తోందని కితాబు ఇచ్చారు. 

ఆసుపత్రిలో రీల్స్‌.. 38 మంది వైద్య విద్యార్థులపై చర్యలు

‘‘లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల మూడ్‌ ఎలా ఉండబోతోందో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా మీరు ఇప్పటికే చెప్పేశారు. అందుకే ఈసారి విపక్షాలకు చెందిన పెద్ద నేతలు కూడా మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తుందని.. ఎన్డీయేకు 400 సీట్లు దాటుతాయని అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌.. 2024లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఆ పార్టీకి ఎన్నికల సమయం వస్తేనే గ్రామాలు, పేదలు, రైతులు గుర్తుకొస్తారు. సికిల్‌సెల్‌ అనీమియాకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపట్టింది ఆదివాసీ ప్రజల ఆరోగ్యం కోసమే. కాంగ్రెస్‌ నినాదం దోచుకోవడం, విభజించడమే. గుజరాత్‌లో గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు లేకపోవడంతో విద్యాభ్యాసం కోసం పిల్లలు కిలో మీటర్ల మేర నడవడం చూశాను. నేను సీఎం అయ్యాక ఆయా ప్రాంతాల్లో స్కూళ్లను తెరిపించాను. ఇప్పుడు గిరిజన పిల్లల కోసం దేశ వ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలలు ప్రారంభిస్తున్నాం. కాంగ్రెస్‌ ఇన్నేళ్లలో కేవలం 100 ఏకలవ్య స్కూళ్లను పెడితే.. భాజపా ప్రభుత్వం వచ్చిన గత పదేళ్లలో భారీ సంఖ్యలో స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నాం’’ అని మోదీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని