Corona Vaccine: కరోనా సోకినవారిలోనే రక్తం గడ్డ కట్టే ముప్పు ఎక్కువ!

కొన్ని కరోనా వ్యాక్సిన్ల వల్ల రక్తం గడ్డ కడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయా టీకాల వినియోగంపై కొన్ని దేశాల్లో పరిమితులు విధించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు...

Published : 27 Aug 2021 12:42 IST

లండన్‌: కొన్ని కరోనా వ్యాక్సిన్ల వల్ల రక్తం గడ్డ కడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయా టీకాల వినియోగంపై కొన్ని దేశాల్లో పరిమితులు విధించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. టీకాలు తీసుకున్న వారిలో కంటే.. కరోనా సోకిన వారిలోనే రక్తం గడ్డ కట్టే ముప్పు ఎక్కువని తేల్చారు. ఈ మేరకు జరిపిన అధ్యయన ఫలితాల్ని బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించారు.

ఆక్స్‌ఫర్డ్‌, లేసెస్టర్‌, కేంబ్రిడ్జి, ఎడిన్‌బర్గ్‌, నాటింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయాలు సహా ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా తొలి డోసు తీసుకున్న మొత్తం 2.9 కోట్ల మందిపై ఈ అధ్యయనం చేశారు. డిసెంబరు 1, 2020- ఏప్రిల్‌ 24, 2021 మధ్య ఈ పరిశోధన జరిగింది. టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ ముప్పు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో మరింత ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. పైగా వీరిలో దీర్ఘకాలం ఈ సమస్య ఉండే అవకాశం ఉన్నట్లు తేల్చారు.

ఏదేమైనప్పటికీ.. టీకా తీసుకున్న వారిలో ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నా.. వెంటనే వైద్యసాయం తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. అలాగే కరోనా సోకిన వారు సైతం దీర్ఘకాలం అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. తద్వారా రక్తం గడ్డ కట్టే ముప్పును ముందే పసిగట్టి నివారణకోసం చికిత్స చేసే అవకాశం ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని