Bullet train project: 2026లో బుల్లెట్‌ ట్రైన్‌ ట్రయల్స్‌.. 350 kmph వేగంతో నిర్వహణ

అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి చాలా రోజుల తర్వాత ఓ కొత్త అప్‌డేట్‌ వచ్చింది. 2026లో తొలిదశ ట్రయల్స్‌ను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలుత గుజరాత్‌లోని బిలిమొర నుంచి సూరత్‌ మధ్య ఈ ట్రయల్స్‌ నిర్వహించనున్నామని పేర్కొన్నారు.

Published : 14 Apr 2022 01:27 IST

భరూచ్‌ (గుజరాత్‌): అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి చాలా రోజుల తర్వాత ఓ కొత్త అప్‌డేట్‌ వచ్చింది. 2026లో తొలిదశ ట్రయల్స్‌ను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలుత గుజరాత్‌లోని బిలిమొర నుంచి సూరత్‌ మధ్య ఈ ట్రయల్స్‌ నిర్వహించనున్నామని పేర్కొన్నారు. తదుపరి ఇతర సెక్షన్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు పెడుతుందని, ఇది విమానం టేకాఫ్‌ అయ్యే వేగంతో సమానమని వివరించారు. అయితే, ప్రజలకు అందుబాటులోకి వచ్చాక గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో నడపనున్నట్లు  అధికారులు పేర్కొన్నారు.

బుల్లెట్‌ ట్రైన్‌ అందుబాటులోకి వస్తే రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని అధికారులు అభిప్రాయపడ్డారు. విమాన ప్రయాణంతో బుల్లెట్‌ ట్రైన్‌ పోటీ పడుతుందని తెలిపారు. విమాన ప్రయాణంతో పోల్చినప్పుడు చెక్‌-ఇన్‌ టైమ్‌ తక్కువగా ఉండడంతో పాటు కూర్చునేందుకు సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. విమానాల్లో అందుబాటులో ఉండనటు వంటి కనెక్టివిటీ సదుపాయం బుల్లెట్‌ ట్రైన్‌లో లభిస్తుందని తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన స్లాబ్‌ ట్రాక్‌ సిస్టమ్‌గా పిలిచే ప్రత్యేక ట్రాక్‌పై ఈ రైళ్లు నడుస్తాయని అధికారులు పేర్కొన్నారు. గరిష్ఠంగా 350 కిలోమీటర్ల వేగాన్ని ఈ ట్రాకులు తట్టుకుంటాయని వివరించారు. అయితే, ఈ రైలు టికెట్‌ ధర ఇంచుమించు ఎకానమీ విమాన టికెట్‌ ధరకు సమానంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు వేగవంతమవుతున్న వేళ రైలు ప్రాజెక్టు పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా గుజరాత్‌లో నేషనల్‌ హై స్పీడ్‌రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 99 శాతం భూమిని సేకరించింది. గుజరాత్‌, దాద్రా నగర్‌ హవేలీలో మొత్తం 352 కిలోమీటర్లకు సంబంధించిన పనులు ఇప్పటికే స్వదేశీ గుత్తేదారులకు అప్పగించారు. మొత్తం ఈ రైలు కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. ఒకసారి ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అహ్మదాబాద్‌ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్‌లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. జపాన్‌ సహకారంతో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని