వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ.. కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

Cabinet: స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పునరుద్ధరించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. 

Updated : 23 Aug 2022 11:47 IST

దిల్లీ: స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పునరుద్ధరించాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. రూ.3 లక్షల వరకు ఉన్న రుణాలపై 1.5 శాతం చొప్పున రాయితీ ఇవ్వనున్నారు. ఈ రాయితీ మొత్తాన్ని రుణాలు జారీ చేసే ఆర్థిక సంస్థలకు కేంద్రం చెల్లిస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు.

కేబినెట్‌ తీసుకున్న వడ్డీ రాయితీ నిర్ణయం వల్ల వ్యవసాయ రంగానికి రుణ లభ్యత పెరుగుతుందని కేంద్రం పేర్కొంది. 2022-23 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరాలకు గానూ ఈ స్కీమ్‌ వర్తిస్తుందని తెలిపింది. దీనివల్ల రూ.34,856 కోట్లు కేంద్రంపై భారం పడుతుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు, స్మాల్‌ఫైనాన్స్‌, రీజినల్‌ రూరల్‌ బ్యాంకులు, కో-ఆపరేటివ్‌, ప్రాథమిక పరపతి సంఘాలకు ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుందని కేంద్రం వెల్లడించింది. రైతులు తీసుకొనే స్వల్పకాలిక రుణాలకు ఎప్పటిలానే 4 శాతం వడ్డీ వర్తిస్తుంది.

  • కొవిడ్‌ కారణంగా దెబ్బతిన్న ఆతిథ్య రంగానికి ఊతమిచ్చేందుకు కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హాస్పిటాలిటీ, అనుబంధ రంగాల్లో సేవలందిస్తున్న సంస్థలకు ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ స్కీమ్‌ (ECLGS)ను ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్కీమ్‌ కింద అందిస్తున్న రూ.4.5 లక్షల కోట్లకు మరో రూ.50వేల కోట్లు అదనంగా కేటాయించింది. ఈ మొత్తాన్ని హాస్పిటాలిటీ రంగానికి ప్రత్యేకించింది. ఇప్పటి వరకు అత్యవసర రుణ పథకం కింద రూ.3.67 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. కొవిడ్‌ సమయంలో దెబ్బతిన్న రంగాలకు ఊతమిచ్చేందుకు ఈ పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts