High Court: ‘హైవేలపై ట్రాక్టర్లను ఉపయోగించకూడదు..’ రైతుల ఆందోళనపై హైకోర్టు

రైతు నిరసనలపై పంజాబ్‌- హరియాణా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం హైవేపై ట్రాక్టర్‌ ట్రాలీలకు అనుమతి లేదని తెలిపింది.

Published : 20 Feb 2024 20:25 IST

చండీగఢ్‌: ‘దిల్లీ చలో (Delhi Chalo)’కు ట్రాక్టర్ ట్రాలీలతో బయలుదేరిన వేలాదిమంది రైతులను పంజాబ్‌-హరియాణా సరిహద్దులోని శంభు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో.. వారం రోజులుగా అక్కడే ఉండిపోయారు. అధికారులు వారిని దిల్లీ వైపు వెళ్లనీయకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, కాంక్రీట్‌ దిమ్మెలను ఏర్పాటుచేశారు. ఈ పరిణామాలతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై పంజాబ్‌- హరియాణా హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. (Farmers Protest)

‘‘ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కుల గురించి తెలుసు. నిరసన తెలిపేందుకు రైతులకు హక్కు ఉంది. కానీ.. అది సహేతుకమైన పరిమితులకు లోబడి ఉంటుంది. రాజ్యాంగ విధులను కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం హైవేలపై ట్రాక్టర్‌ ట్రాలీలకు అనుమతి లేదు’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. రైతులు పెద్దసంఖ్యలో ఒకచోట చేరేందుకు ఎలా అనుమతించారని పంజాబ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరుపుతున్నట్లు విచారణ సందర్భంగా కేంద్రం తెలిపింది. సమావేశాల్లో ఏం జరిగిందనే వివరాలను తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది.

చర్చలు విఫలం.. ఆందోళన కొనసాగింపునకు రైతు నేతల నిర్ణయం

రైతు నేతలతో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి వరకు జరిపిన నాలుగో విడత చర్చలు విఫలమయ్యాయి. పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరకు కొంటాయని.. ఇందుకోసం ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమన్న కేంద్ర ప్రతిపాదనను రైతు నేతలు తిరస్కరించారు. అది అన్నదాతల ప్రయోజనాలకు అనుగుణంగా లేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని