ICMR Study: కొవిడ్‌ టీకా.. యువత ఆకస్మిక మరణాల ముప్పును పెంచలేదు.. కానీ!

భారత్‌లో యువతలో ఆకస్మిక మరణాలను కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ పెంచలేదని.. వాస్తవానికి ఆకస్మిక మరణాల ముప్పును వ్యాక్సిన్‌లు తగ్గించాయని ఐసీఎంఆర్‌ అధ్యయనం పేర్కొంది.

Published : 30 Oct 2023 20:49 IST

దిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌ (Covid vaccination) దేశ యువతలో ఆకస్మిక మరణాల ముప్పును పెంచలేదని భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అధ్యయనం వెల్లడించింది. ‘భారత్‌లో యువతలో ఆకస్మిక మరణాలను కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ పెంచలేదు. వాస్తవానికి ఆకస్మిక మరణాల ముప్పును వ్యాక్సిన్‌లు తగ్గించాయి. గతంలో కొవిడ్‌ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందడం, అతి మద్యపానం, స్వల్ప సమయంలో అతిగా శారీరక శ్రమ వంటివి ఈ అవకాశాలను పెంచాయి’ అని తాజా అధ్యయనం తెలిపింది. ఇందుకు సంబంధించిన అధ్యయనం ఇప్పటికే పూర్తయ్యింది. కాగా.. ప్రస్తుతం సమీక్ష దశలో ఉన్న ఈ అధ్యయన వివరాలు బయటకు వచ్చాయి.

‘యువకుల్లో ఆకస్మిక మరణాలకు సంబంధించిన కారకాలు’పై దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఐసీఎంఆర్‌ అధ్యయనం నిర్వహించింది. సమీక్ష దశలో ఉన్న ఈ అధ్యయనంలోని అంశాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ కూడా ప్రస్తావించారు. గుజరాత్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గతంలో తీవ్ర కొవిడ్‌ బారినపడిన వారు ఒకటి, రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకూడదని అన్నారు. తద్వారా గుండెపోటు బారిన పడకుండా ఉండవచ్చని సూచించారు.

కరోనా మహమ్మారి విజృంభణ, అనంతరం ఆరోగ్యవంతులైన యువకులు ఆకస్మిక మరణాల బారినపడటం దేశంలో చర్చనీయాంశమయ్యింది. కొవిడ్‌-19 లేదా వ్యాక్సినేషన్‌ కారణంగానే ఈ మరణాలు పెరిగాయనే ఆందోళనలు ఎక్కువయ్యాయి. దీంతో వీటి కారణాలను అన్వేషించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ అధ్యయనం చేపట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్‌ 1, 2021 నుంచి మార్చి 31, 2023 మధ్యకాలంలో ఆకస్మికంగా మరణించిన 18-45ఏళ్ల వయసు వ్యక్తుల కేసులను అధ్యయనం చేసింది. ఇటువంటి 729 కేసులు, 2916 కంట్రోల్‌ కేసులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. వారి ఆరోగ్య చరిత్ర, ధూమపానం, మద్యపానం అలవాట్లు, తీవ్ర శ్రమ, కొవిడ్‌ కారణంగా ఆసుపత్రిలో చేరడం, వ్యాక్సిన్‌ డోసులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని