HD Deve Gowda: ‘అధికారం కోసమే బతకడం లేదు’.. దేవేగౌడ భావోద్వేగం..!

రాష్ట్రంలో నీటి ఎద్దడి, పంటల పరిస్థితిపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ లేఖ రాశారు.

Published : 25 Sep 2023 16:45 IST

బెంగళూరు: కావేరి జలాల పంపిణీ (Cauvery water dispute) విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఎంతోకాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నీటి ఎద్దడి, పంటల పరిస్థితిపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)కి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ (Deve Gowda) లేఖ రాశారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన జేడీ(ఎస్‌) అధినేత .. ఓ సందర్భంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

‘రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న నీటి పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు ఓ నిపుణుల బృందాన్ని పంపించాలని కేంద్రాన్ని కోరుతున్నా. రాజకీయాల కోసమో, అధికారం కోసమో నేను బతకడం లేదు. రాష్ట్ర ప్రజలను రక్షించేందుకే ఉన్నాం. మా పార్టీ కూడా అందుకే ఉంది’ అని హెచ్‌డీ దేవేగౌడ భావోద్వేగంతో పేర్కొన్నారు. ఇక్కడి ప్రభుత్వం తమిళనాడుకు నీటిని విడుదల చేయడాన్ని తప్పుపట్టిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటుందన్నారు. కావేరి జలాల పంపిణీ విషయంలో రెండు రాష్ట్రాలకు సంబంధం లేకుండా బయట ఏజెన్సీని ఏర్పాటు చేసేలా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖను ఆదేశించాలని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

కరువు కాలంలో కావేరి చిచ్చు

కావేరి జలాల విడుదల విషయంలో ఇటు కర్ణాటకతోపాటు తమిళనాడులోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. తమిళనాడుకు నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటకలోని రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయి. మొన్నటి వరకు మండ్యకే పరిమితమైన ఆందోళనలు తాజాగా రాష్ట్రమంతటా విస్తరించాయి. కావేరి బేసిన్‌లో ఈ సీజన్‌లో సరైన వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లన్నీ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని కన్నడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 26న బెంగళూరు బంద్‌కూ పిలుపునిచ్చాయి. మరోవైపు, తమకు అవసరమైన నీటిని విడుదల చేసి తమ పంటలను రక్షించాలంటూ తమిళనాడు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని