Indian Army: గల్వాన్‌లో ఉద్రిక్తతల వేళ..అప్పటి ఆర్మీ చీఫ్‌కు రాజ్‌నాథ్‌ ఏం ఆదేశాలిచ్చారు?

భారత్‌-చైనా సైనికుల మధ్య మూడేళ్ల క్రితం గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ (Galwan clash) అనంతరం ఉద్రిక్త పరిస్థితుల వేళ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అప్పటి భారత సైనికాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణెకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలిసింది.

Updated : 19 Dec 2023 14:47 IST

దిల్లీ: భారత్‌-చైనా సైనికుల మధ్య మూడేళ్ల క్రితం గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ (Galwan clash) ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. 2020 జూన్‌ నాటి పరిస్థితులు యుద్ధం అంచులకు తీసుకెళ్లాయి. ఆ సమయంలో అప్పటి భారత సైనికాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె (Indian Army), రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశాంగ మంత్రితోపాటు జాతీయ భద్రతా సలహాదారు మధ్య కీలక సంభాషణలు జరిగాయి. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ‘మీకు ఏది సముచితం అనిపిస్తే అది చేయండి’ అంటూ జనరల్‌ నరవణెకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదేశాలిచ్చారని తెలిసింది.

గల్వాన్‌ ఘర్షణ అనంతరం తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ.. ఆగస్టు నెలలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న రెకిన్‌ లా పర్వత ప్రాంతాల్లో యుద్ధ ట్యాంకులు, సైనిక బలగాలను చైనా మోహరించడం మొదలుపెట్టింది. సరిహద్దులకు చేరుకోవడం మరింత క్లిష్లతరంగా మారింది. ఇదే విషయాన్ని  కేంద్ర రక్షణశాఖకు భారత సైన్యం వివరించడంతో అప్రమత్తమైన ప్రభుత్వం వివిధ శాఖాధిపతులతో సంప్రదింపులు చేపట్టింది. ఆగస్టు 31 రాత్రి రక్షణశాఖ మంత్రి, విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారుతోపాటు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ల మధ్య ఫోన్‌ కాల్స్‌ సంభాషణలు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇచ్చిన ఆదేశాలను జనరల్‌ నరవణె గుర్తుచేసుకున్నారు.

Gen Naravane: జూన్‌ 16ను.. షీ ‘జిన్‌పింగ్‌’ ఇప్పట్లో మరచిపోడు!

రాజ్‌నాథ్‌ సింగ్‌ నుంచి ఫోన్‌ కాల్‌ రాగానే తన మదిలో వంద రకాల ఆలోచనలు వచ్చాయని జనరల్‌ నరవణె పేర్కొన్నారు. ‘పరిస్థితి తీవ్రతను రక్షణ మంత్రికి తెలియజేశాను. రాత్రి 11.30లోపు తిరిగి సంప్రదిస్తానని రాజ్‌నాథ్‌ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడానని చెప్పారు. అది పూర్తిగా సైనిక నిర్ణయమని, మీకు ఏది సముచితం అనిపిస్తే అది చేయండి అని సూచించారు. దాంతో బాధ్యత మొత్తం నాపైనే పడింది. అప్పుడు దీర్ఘశ్వాస తీసుకొని కొన్ని నిమిషాల పాటు అలాగే మౌనంగా కూర్చున్నా’.

అనంతరం తూర్పు కమాండ్, పలువురు ఇతర అధికారులతో ఆర్మీ హౌస్‌ అన్ని మ్యాప్‌లను పరిశీలించాం. అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం.. కానీ, నిజంగా యుద్ధం ప్రారంభించాలా? అనే ప్రశ్న మొదలయ్యింది. ఓవైపు కొవిడ్‌ మహమ్మారి, మరోవైపు ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, వస్తు సరఫరా వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి ప్రతికూల సమయంలో యుద్ధం మొదలుపెడితే అంతర్జాతీయంగా మనకు మద్దతుగా నిలిచేవారు ఎవరు? చైనా-పాకిస్థాన్‌లు కలిస్తే ఎదురయ్యే ముప్పు ఏంటి? ఇలా వందల ప్రశ్నలు ఆ రోజు రాత్రి తన మదిలో మెదిలినట్లు జనరల్‌ ఎం.ఎం.నరవణె తన పుస్తకంలో వివరించారు. యుద్ధం అంచులకు వెళ్లిన నాటి పరిస్థితుల్లో వ్యవహరించిన తీరును ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ (Four Stars of Destiny) పుస్తకంలో పేర్కొన్నారు. మాజీ సైనికాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె రాసిన ఈ పుస్తకం త్వరలో అందుబాటులోకి రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని